
K. A. Paul: జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు.. కేఏ పాల్ డైలాగుల్లో సీనియనెస్ అస్సలు ఉండదు. ఆయన ఏది చెప్పినా, విమర్శించినా అంతగా ఎవరూ పట్టించుకోరు. కింద పడ్డా నాదే పై చేయి అంటుండే ఆయన రాజకీయాలపై చేసే విశ్లేషణలు బహు కర్ణ సుఖంగా ఉంటాయి. ఆయన మాటలను అందరూ పదే పదే వినాలనుకంటారు. మాట్లాడాలనుకుంటారు. దేశంలో ప్రజాశాంతి పార్టీ గెలిపించి తీరతానని శపథం చేస్తుండే కేఏ పాల్ తాజాగా చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతుంది.
ఎన్నికల సమయంలో ప్రత్యక్షమై ప్రజానీకానికి శుద్ధమైన వ్యాక్యాలు చెబుతూ రిఫ్రెష్ చేస్తుంటారు కేఏ పాల్. 2014లోనే కంటెస్ట్ చేద్దామని చూసినా, ఓటు కనబడలేదు. ఆ ఎన్నిక అలా మిస్ అయిపోయింది. 2019 ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రాబోతుందని కరాఖండిగా చెప్పారు. అప్పుడు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయనకు అసెంబ్లీ స్థానానికి పోలైనవి మొత్తంగా 281. ఎంపీ స్థానానికి 3037. నోటాకు లభించింది 12,066. ఆయన కంటే స్వతంత్ర పార్టీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు రావడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు.
మరలా హఠాత్తుగా తెలంగాణా మునుగోడు ఉప ఎన్నికలో కనిపించారు. వినూత్న శైలిలో ప్రచారం నిర్వహించి వచ్చేది ప్రజాశాంతి పార్టీనేనని ఢంకా బజాయించి చెప్పారు. బ్రహ్మానందాన్ని మించిన కామెడీని పంచిపెట్టి ఆ విజయాన్ని కూడా చేజార్చుకున్నారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడుక్కుతుంది. మరలా కేఏ పాల్ హడావుడి మొదలైంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణాలో బీజేపీ, ఆంధ్రాలో వైసీపీ గెలవడానికి కారణాలను విశ్లేషించారు. ప్రజాశాంతి పార్టీ పోటీ చేయకపోవడం వల్లనే ఆ రెండు పార్టీలు గెలిచాయని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణాలో జరగబోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ అన్ని స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేసి గెలిచిన తరువాత, ఆంధ్రాలో జరగబోయే ఎన్నికలపై కూడా దృష్టి పెట్టి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
మార్పు కోరుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని 2019లో ప్రచారం చేసిన కేఏ పాల్, గెలవబోయే పార్టీ కూడా ప్రజాశాంతి పార్టీనేనని అన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకపోవడంతో, మాట మార్చారు. ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడం వల్లేనే ఓడిపోయానని ఆరోపిస్తూ వీడియోలు విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కూడా అధికార పార్టీ అరాచకాలకు ప్రతిరూపమని అన్నారు. 2024 ఎన్నికల్లోనైనా ఆయన గెలుపును ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ దేశంగాని, జాతీయ స్థాయిలో ఏ పార్టీగాని తలదూర్చకుండా ఉండాలని, ఆంధ్రాను అమెరికాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.