
MLC Election 2023 : ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మరో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో వైసీపీ, టీడీపీలు ఎవరికి వారుగా ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 13న మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగింది. అందులో ఉపాధ్యాయ స్థానాలు వైసీపీ, పట్టభద్రుల స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి. 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలు కనుక..ఇది సంపూర్ణ విజయమని టీడీపీ చెబుతోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు వ్యతిరేకం అన్న ప్రచారం ఉత్తదేనని.. అటువంటప్పుడు రెండు ఉపాధ్యాయ స్థానాలను ఎలా దక్కించుకోగలిగమని వైసీపీ భావిస్తోంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ.. ఈ నెల 23న ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో జరగనున్న పోలింగ్ లో ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. అయితే ఇరు పార్టీలు రెబల్స్ మీద ఆశలు పెట్టుకున్నాయి.
ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఏడు స్థానాలకు పోటీ జరగనుంది. ఏడింటికీ వైసీపీ పోటీ పెట్టింది. అంతా ఏకగ్రీవమవుతాయని భావించింది. కానీ టీడీపీ అనూహ్యంగా బీసీ మహిళా నేత పంచుమర్తి అనురాధను బరిలో దించింది. దీంతో పోటీ అనివార్యంగా మారింది. ప్రస్తుతం వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేనకు చెందిన రాపాక, టీడీపీకి చెందిన కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు అధికార పార్టీ నీడన చేరారు. దీంతో అధికార వైసీపీ బలం 156కు చేరింది. కానీ ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ధిక్కార స్వరం వినిపించారు. పార్టీకి దూరమయ్యారు. వైసీపీ కూడా దూరం చేసింది. దీంతో వైసీపీ బలం 154. అదే సమయంలో ఇద్దరు వైసీపీ రెబల్స్ టీడీపీ గూటికి చేరితే మాత్రం ఆ పార్టీ బలం 21కు చేరుతుంది. ఇంకా ఒక్క ఎమ్మెల్యే కానీ టీడీపీకి చిక్కితే ఆ పార్టీ అభ్యర్థి అనురాధ ఎమ్మెల్సీ కావడం ఖాయం. అదే జరిగితే వైసీపీ నుంచి బరిలో దిగిన ఒకరు ఓడిపోవడం తప్పనిసరి. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పోలింగ్ నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమని ప్రచారం ప్రారంభించింది.
ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన ఊపు మీద ఉన్న చంద్రబాబు తన బుర్రకు పదును పెడుతున్నారు. వైసీపీ పని అయిపోయిందని చెబుతూనే ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే దానిని హైలెట్ చేయ్యాలని చూస్తున్నారు. టీడీపీకి రావాల్సిన ఎమ్మెల్సీని దొడ్డిదారిన తీసుకెళ్ళిపోయారన్న ప్రచారంతో ప్రజల నుంచి సింపతి పొందాని ప్లాన్ చేస్తున్నారు. తమకు నలుగురు దూరమైనా వైసీపీ లో ఇప్పటికే ఇద్దరు రెబల్స్ తమకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని టీడీపీ విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరిని వైసీపీ తమ లెక్క నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. ఆనం..కోటంరెడ్డి తమ ఆత్మప్రభోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరూ ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. మరో ఎమ్మెల్యే మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కూడా గేమ్ మొదలు పెట్టింది. తమ క్యాంపు నుంచి ఎవరూ చేజారకుండానే…టీడీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పటం ద్వారా రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.
పట్టభద్రుల స్థానాల్లో చేతులు కాల్చుకున్న వైసీపీ ఈ ఎన్నికను తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏ మాత్రం విపక్షానికి అవకాశమిచ్చినా మూల్యం చెల్లించుకోక తప్పదని భావిస్తోంది. అందుకే మాక్ పోలింగ్ నిర్వహించింది. కానీ అందులో ఇద్దరు ఓటు వేయడంలో పొరబడ్డారు. అందుకే రెండోసారి మాక్ పోలింగ్ కు సిద్ధమైంది. మంత్రులకు, సీనియర్లకు ఆ బాధ్యత అప్పగించింది. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని కేటాయించింది. ఈ నెల 22న ఎమ్మెల్యేలకు విందుకు ఆహ్వానించారు. 23న నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లేలా ప్లాన్ చేసింది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే దీనిని నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ పావులు కదుపుతోంది. రెండు పార్టీల ఎత్తుల పైఎత్తులతో రాజకీయం హీటెక్కింది.