Punganur: మరీ ఇంత దారుణమా.. పెద్దిరెడ్డి పెద్దరికానికి సవాల్..

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో గాంధీ జయంతి నాడు సైకిల్ యాత్ర ప్రారంభించారు.

Written By: Chiranjeevi Appeesa, Updated On : October 21, 2023 1:52 pm

Punganur

Follow us on

Punganur: ఏపీలో వైసీపీ రాజ్యం నడుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ వైసిపి నేతలు దుశ్చర్యలకు దిగుతున్నారు. ప్రజల మానప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. శాంతియుతంగా తమ భావాన్ని తెలిపే వారిని సైతం విడిచిపెట్టడం లేదు.వారిపై సైతం దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఐదుగురు టిడిపి కార్యకర్తలపై అనుచితంగా ప్రవర్తించారు. దాడి చేసినంత పని చేశారు . వారిని అర్ధ నగ్నంగా విడిచిపెట్టారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందర్ రావు, రమేష్ లు అక్టోబర్ రెండో గాంధీ జయంతి నాడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టునకు నిరసనగా.. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర తలపెట్టారు. మధ్యలో దేవాలయాల్లో చంద్రబాబు పేరిట పూజలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం వారి సైకిల్ యాత్ర పుంగనూరు చేరుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పుంగనూరు మండలం సుగాలి మిట్ట వద్ద టీ తాగేందుకు వారు సైకిళ్లు ఆపారు. ఈ క్రమంలో వైసిపి కార్యకర్తలు అక్కడకు వచ్చి వారిపై దుర్భాషలాడారు.

వైసిపి కార్యకర్తలు చుట్టుముట్టడంతో టిడిపి కార్యకర్తలు భయంతో బితుకు బితుకుమన్నారు. సాధారణంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఎవరైనా మర్యాదగా వ్యవహరిస్తారు. ” ఇది పెద్దిరెడ్డి అడ్డా. పుంగనూరులో అడుగుపెట్టి వెనక్కి వెళ్ళగలరా? చంద్రబాబునే రానివ్వలేదు. అటువంటిది టిడిపి జెండాలతో మీరు ఎలా వస్తారు రా. అసలు శ్రీకాకుళం నుంచి ఏం పీకేందుకు వచ్చారు రా ” అంటూ రెచ్చిపోయారు. చొక్కాలు విప్పించి, టిడిపి జెండాలు, కండువాలు తీయించాకే పుంగనూరు నుంచి కదలనిచ్చారు.

అయితే ఇలా దుర్భాషలాడే క్రమంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు వీడియోలు తీశారు. టిడిపి కార్యకర్తలు జెండాలు, పసుపు షర్టులు తీసే వరకు వీడియోలో చిత్రీకరిస్తూనే ఉన్నారు. అందులో వైసిపి కార్యకర్త తన పేరు చెంగలాపురం సూరిగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాలో ఎవరు శాంతియుతంగా నిరసన చేపట్టడానికి వీల్లేదు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం లేదు అన్న మాదిరిగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కొద్దిరోజుల కిందటే తాను హుందాగా వ్యవహరిస్తానని చెప్పుకున్న పెద్దిరెడ్డి.. వైసీపీ శ్రేణులను నియంత్రించకుంటే తన పెద్దరికానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది.