
తెలుగుదేశం పార్టీ శాసన సభ సమావేశాలను బహిష్కరించింది. తొలుత టీడీపీ శాసన సభ సమావేశంలో హాజరై రాష్ట్రంలో నెలకొన్న అన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించింది. సభ రెండు రోజులే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించడం, వివిధ అంశాలపై చర్చలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరించడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు, ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టులు వ్యతిరేకంగా నల్ల చొక్కాలు ధరించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లోకేష్, ఇతర ఎమ్మెల్సీలు సభకు హాజరై నిరసన తెలిపారు.
ఈ శాసన సభ సమావేశాల్లో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, అమరావతి రాజధాని అంశం, ప్రత్యేక హోదా, కరెంట్ చార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు, ఇసుక అక్రమ రవాణా, మద్యం ధరల పెరుగుదల, అచ్చెన్నాయుడు అక్రమ అరెస్ట్, దళితులపై దాడులు, బిల్డ్ ఏపీ ఇలా తదితర అంశాలను సభలో చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో కోరితే ప్రభుత్వం చర్చకు అవకాశం లేదని చెప్పడంతో శాసన సభ సమావేశాలు బహిష్కరించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని టిడిపి నాయకులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు.