వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సొంత పార్టీలోనే వేరే కుంపటి పెట్టుకుని మరీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో వైసీపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యంరా దేవుడా అంటూ నిట్టూరుస్తున్నారు. సొంత పార్టీలోనే ప్రతిపక్షం మాదిరి రఘురామ వ్యవహారం ముదిరిపోతోంది. రోజుకో లేఖ సంధిస్తూ గవర్నమెంట్ ను ఇరుకున పెడుతున్నారు. దీనికి టీడీపీ నుంచి కూడా మద్దతు ఉందనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రలో ఏ పార్టీకి రాని దుస్థితి వైసీపీకి ఏర్పడుతోంది.
వైసీపీలో వివాదాలు పెరుతున్నాయి. రఘురామ విషయంలో ఆ పార్టీ ఆయనను బహిష్కరించలేదు. ఆయన కూడా రాజీనామా చేయలేదు. రఘురామ వ్యవహారంలో టీడీపీ పాత్ర పక్కాగా ఉందనే వదంతులు వినిపిస్తున్నాయి. వారు కూడా ఎక్కువగానే చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ స్పందించేదాని కంటే అతి చేస్తుందని ఆరోపిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వర్సెస్ వైసీపీ విషయంలో చంద్రబాబే కాదు టీడీపీ నేతలు కూడా ఓవర్ చేస్తున్నారని తెలుస్తోంది.
చంద్రబాబుపై విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ గురించి పట్టించుకోకుండా ఇతర పార్టీల వ్యవహారంలో జోక్యం చేసుకుని వారిని అష్టకష్టాలు పెట్టే బదులు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా గొడవలు ఉంటే వారే చూసుకుంటారు కానీ అందులో చంద్రబాబు వేలు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బాబు మారకపోతే ఆయనకే నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
సీనియర్ నాయకుడిగా పేరొందిన చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేయడం మంచిది కాదంటున్నారు. ఈ విషయంలో బీజేపీ, కమ్యూనిస్టులు అనుసరిస్తున్నవైఖరి బాగుందనే వాదన వినిపిస్తోంది. రఘురామ వ్యవహారంలో హుందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు చిల్లరగా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.