TDP Richest Regional Party: దేశంలో రిచెస్ట్ రీజినల్ పార్టీగా టీడీపీ ఆవిర్భవించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆదాయంతో రికార్డు సృష్టించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, టీడీపీ రూ.228.31 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం 36 పార్టీల ఆదాయంలో సుమారు 19.14% వాటా. ఇది టీడీపీకి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారం సాధించిన తర్వాత పార్టీ ఆర్థిక బలం ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. అయితే, ఈ నివేదిక మొత్తం రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, పారదర్శకత లోపాన్ని కూడా బయటపెడుతోంది.
పార్టీల వారీగా ఆదాయం..
టీడీపీ రూ.228.31 కోట్లు మొదటి స్థానంలో ఉండగా, టీఎంసీ రూ.219.35 కోట్లుతో రెండో స్థానంలో ఉంది. వైఎస్సార్‌సీపీ రూ.140.39 కోటుతో మూడోస్థానంలో ఉంది. 36 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.1,192.94 కోట్లు ఉంది.
ఖర్చుల్లో వైసీపీ ఫస్ట్..
ఇక డబ్బులు ఖర్చు చేయడంలో వైసీపీ రూ.340 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బీజేడీ రూ.288 కోట్లు, టీఎంసీ రూ.228 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా 21 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయి
టాప్ ఐదు పార్టీలు మొత్తం ఆదాయంలో 69 శాతం వాటా, ఖర్చుల్లో 77 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇది రాజకీయ ఆర్థిక అసమానతలను స్పష్టంగా చూపిస్తోంది.
టీడీపీ ఆదాయం పెరగడానికి కారణం..
టీడీపీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో సాధించిన భారీ విజయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ దాతలు, వ్యాపారవేత్తలు, సభ్యుల నుంచి వచ్చిన విరాళాలు భారీగా పెరిగినట్లు అనిపిస్తోంది. ఇది రాజకీయంగా విజయవంతమైన పార్టీలకు ఆర్థిక లాభాలు ఎలా అందుతాయో చూపే ఉదాహరణ.అయితే, వైఎస్సార్‌సీపీ ఖర్చు ఆదాయం కంటే దాదాపు రెట్టింపు ఉండటం ఆసక్తికరం. ఎన్నికల ప్రచారం, సంక్షేమ కార్యక్రమాలు, సభలు, ఆస్తి నిర్వహణ ఇవన్నీ భారీ ఖర్చులకు దారితీశాయి. ఇలాంటి లోటు దీర్ఘకాలంలో పార్టీని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తుంది.
ఆడిట్ రిపోర్టు ఇవ్వని పార్టీలు..
దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, కేవలం 36 మాత్రమే ఆడిట్ రిపోర్టులు సమర్పించాయి. మిగిలిన 31 పార్టీలు ఇంకా నివేదికలు అందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు కాబట్టి, వాటి ఆర్థిక వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా ఉండాలి. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. ఎన్నికల బాండ్లు రద్దు అయిన తర్వాత కూడా రాజకీయ నిధుల మూలాలు పూర్తిగా స్పష్టంగా లేవు. ఎవరు ఎంత ఇచ్చారు, ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతోంది ప్రజలకు తెలియాలి. లేకపోతే, రాజకీయాలు కొన్ని కార్పొరేట్ సమూహాల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
బలం మంచిదే, కానీ బాధ్యత కూడా టీడీపీ రికార్డు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సానుకూల అభివృద్ధిగా చూడవచ్చు. అయితే, ఇది రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలో మాత్రమే కాకుండా, ఆ బలాన్ని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలా ఉపయోగించాలో కూడా గుర్తు చేస్తుంది ఏడీఆర్.నివేదికలు ప్రజాస్వామ్యానికి అద్దంగా ఉంటాయి. కానీ ఆ నివేదికలు పూర్తిగా రావాలంటే అన్ని పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన చట్టాలు, స్వతంత్ర ఆడిట్, పూర్తి పారదర్శకత అమలు చేయాల్సిన అవసరం ఈ గణాంకాలు మరోసారి ఉద్ఘాటిస్తున్నాయి.
