Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047.. వైసీపీ బ్రేక్ వేయగలదా?

చంద్రబాబు ఆ మధ్యన రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. ఆ సందర్భంలో ఆయన డాక్యుమెంటరీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ సర్కార్ సాగునీటి రంగానికి ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : August 15, 2023 11:20 am

Chandrababu Vision 2047

Follow us on

Chandrababu Vision 2047: చంద్రబాబు పూర్తిగా పంథాను మార్చారు. వైసీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు. అధికార పార్టీ నేతల దూకుడును తగ్గించగలుగుతున్నారు. ప్రజల ముందు వారిని పలుచన చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అధికార పార్టీ నాయకులకు తెలియడం లేదు. చంద్రబాబుకు దీటైన కౌంటర్ ఇవ్వాలని ఉన్నా అది ఎలాగో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల ముంగిట ఓ రకమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.

ప్రత్యర్థులపై ఎలా విరుచుకుపడాలో వైసీపీ నేతలకు తెలిసినట్టుగా.. మరి ఎవరికీ తెలియదు. అంతలా విమర్శనాస్త్రాలు సంధించగలరు. దూకుడు కనబరచగలరు. రాజకీయ ప్రత్యర్థులు ఒక్క మాట అంటే.. దానికి పది రకాలుగా దాడి చేయగల చతురత వారి సొంతం.చివరకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం వెంటాడి,వేటాడారు. ఉమ్మడి రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన చంద్రబాబునే.. శాసనసభ వేదికగా ఏడిపించారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ సర్కార్ వైఫల్యాలపై మాట్లాడేందుకు మేధావులు సైతం ముందుకు రాని దుస్థితి. దీనికి వైసీపీ నేతల దూకుడే కారణం. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతల నోటికి తాళం పడుతోంది.

చంద్రబాబు ఆ మధ్యన రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. ఆ సందర్భంలో ఆయన డాక్యుమెంటరీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చారు. వైసీపీ సర్కార్ సాగునీటి రంగానికి ఎలా నిర్లక్ష్యం చేసిందో చెప్పుకొచ్చారు. గణాంకాలతో సహా వివరించగలిగారు. దీనికి ఒక్కరంటే ఒక్కరు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోయారు. చివరకు లక్షలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్న సలహాదారుల సైతం మిన్న కుండా పోయారు. ఒకరిద్దరు నేతలు పాత పద్ధతిలో మాట్లాడి మమ అనిపించేశారు. వాస్తవానికి చంద్రబాబు సైతం రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది. అటువంటిది ఆయనే రాయలసీమ వెళ్లి గణాంకాలతో సహా వైసీపీ వైఫల్యాలను వివరించగలిగారు. ఇవి ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లాయి.

ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అన్న నినాదాన్ని చంద్రబాబు అందుకున్నారు. మరో పాతికేళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఒక విజన్ డాక్యుమెంట్ ని చంద్రబాబు రూపొందించారు. విశాఖలో మేధావులు, విద్యావంతుల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. కచ్చితంగా ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తున్న వారికి ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఏపీలో అభివృద్ధి లేదన్న విమర్శ ప్రజల్లో బలంగా ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వైసీపీ సర్కార్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే పాత విమర్శలకే వైసీపీ నేతలు పరిమితమవుతారు. విజన్ డాక్యుమెంట్ పై మాట్లాడే స్థితిలో వారు లేరన్న విషయం.. గత అనుభవాలే తెలియజేశాయి.సో చంద్రబాబు ప్రయత్నాలను వైసిపి దూకుడు బ్యాచ్ అడ్డుకో లేని స్థితిలో ఉందన్నమాట.