వాస్తవానికి చెప్పుకోవాలంటే పవన్ కల్యాణ్ ఓ నటుడు. సినిమాల్లో ఆయనకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే.. సినిమాల్లో ఆయన ఒకరి డైరెక్షన్‌లో వర్క్ చేస్తుంటారు. కానీ.. రాజకీయాల్లో అలా కాదు. పవన్‌ను డైరెక్ట్ చేయాలనుకోవాలని అనుకోవడం కూడా తప్పే. అయినా కూడా కొందరు ఆ సాహసం చేశారు.
ఏడాది క్రితం పవన్ కల్యాణ్ కమలదళంతో దోస్తీ కట్టారు. కానీ.. ఆయన బీజేపీతో ఎందుకు చేరిపోయారో కూడా ఆటైమ్‌లో ఎవరికీ అర్థం కాలేదు. అయితే.. దాని వెనుక కూడా చంద్రబాబు ఉన్నారనే ప్రచారం ఉంది. సడన్‌గా ఇప్పుడు పవన్ బీజేపీతో మద్దతు ఉపసంహరించుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే.. వైసీపీ నేతలు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ను డైరెక్ట్ చేస్తోంది చంద్రబాబే అన్నట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే.. తన రాజకీయంలో ఇప్పటివరకు చంద్రబాబును సైతం విమర్శించిన దాఖలాలు లేవు. ఏనాడూ చంద్రబాబును నిలదీసింది లేదు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పొత్తు సాగిస్తున్న జనసేన.. తెలంగాణలో మాత్రం ఆ బంధం కొనసాగించలేకపోతోంది. ఏకంగా అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అంతేకాదు.. అక్కడి బీజేపీనేతలపై హాట్ కామెంట్లే చేశారు. దీంతో ఏపీలోనూ బంధం తెగిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ప్రచారం ఇంకా నడుస్తూనే ఉంది.
ఏపీలో బీజేపీ కంటే పవన్ కల్యాణ్‌దే పెద్ద పార్టీ అని చెప్పాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ అదే నిరూపితమైంది. దీంతో ఇప్పుడు ఆయన బీజేపీకి బైబై చెప్పబోతున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ డైరెక్షన్‌లో నడుస్తున్న పవన్‌ను.. మరోసారి తిరుపతి వేదికగా కంట్రోల్‌లో పెట్టాలని చూస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి రావద్దంటూ పవన్‌కు టీడీపీ నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి అయితే పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పవన్ సహకారం లేకపోతే బీజేపీ బండారం ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ తెలుస్తుందని కూడా అంటున్నారు.
పవన్ కనుక బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొంటే అది కచ్చితంగా టీడీపీకే నష్టం అని ఆ పార్టీ నేతలు గుర్తించారు. పవన్ ప్రచారంతో ఆయన్ని అభిమానించే వారంతా బీజేపీకి ఓటు చేస్తే ఆ మేరకు ఓట్లు చీలి వైసీపీ మెజారిటీ దారుణంగా పెరుగుతుంది, టీడీపీ పరువు గంగలో కలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్‌ను ప్రచారానికి రావద్దు అని టీడీపీ కోరుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలా చోట్ల టీడీపీ, జనసేనలు అండర్ స్టాండింగ్‌లో పోటీలో నిలిచాయి. బహిరంగ పొత్తు కాకున్నా ఇంటర్నల్‌గా తాము అంతా ఒకటే అన్నట్లు నిరూపించారు. టీడీపీతో పొత్తు సాగిస్తే అటు టీడీపీతోపాటు జనసేనకు సైతం కలిసొస్తుందన్న భావన ఇరు పార్టీల నేతల్లోనే కనిపిస్తోంది. సో.. భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారాయి.