దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చాలామంది రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్లకు ఖర్చులు పెరుగుతుంటే ఆదాయం మాత్రం పెరగడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన ఒక టీచర్ మాత్రం పార్ట్ టైమ్ వ్యవసాయంతో లక్షలు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలకు పైగా టీచర్ గా పని చేస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తుండటం గమనార్హం.
టీచర్ ఉద్యోగం కంటే వ్యవసాయం ద్వారానే ఆ టీచర్ లక్షల రూపాయలు సంపాదించడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దౌలత్‌పూర్‌లో నివసిస్తున్న అమరేంద్ర ప్రతాప్ సింగ్ ప్రస్తుతం వ్యవసాయం ద్వారా సంవత్సరానికి 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. 2014 సంవత్సరం నుంచి అమరేంద్ర ప్రతాప్ సింగ్ 30 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలు, ఆన్ లైన్ ట్యూటోరియల్స్ సాయంలో అమరేంద్ర వ్యవసాయంలో మెలుకువలు నేర్చుకున్నారు.
అమరేంద్ర నివశించే ప్రాంతంలో రైతులు ఎక్కువగా యూట్యూబ్ ఛానెళ్ల వీడియోలను చూశారు. మొదట అరటి సాగు చేసిన అమరేంద్ర ఆ తరువాత పసుపు, అల్లం, కాలీఫ్లవర్లను పండించారు. అల్లం వల్ల పెద్దగా లాభం రాకపోయినా పసుపు అతనికి మంచి లాభం తెచ్చిపెట్టింది. తరువాత కాలంలో అమరేంద్ర స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్, పుట్టగొడుగులను కూడా పండించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పంటలు పందిస్తున్న అమరేంద్ర ప్రస్తుతం 60 ఎకరాలు సాగు చేస్తూ 30 ఎకరాల భూమిలో కూరగాయలను, మిగిలిన 30 ఎకరాల్లో ఇతర పంటలను పండిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు. సంవత్సరం సంవత్సరానికి అమరేంద్ర పండించిన పంటలకు లాభాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.