విశాఖ అందమైన సుందర నగరం. భావ వ్యక్తీకరణ, బావుకతకు పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయాలు ఎక్కువే. ప్రతినిత్యం పార్టీలు విమర్శలతోనే కాలం గడుపుతుంటాయి. అధికార పార్టీ ప్రతిపక్షం మీద, ప్రతిపక్షం మరో పార్టీమీద ఆరోపణలు చేసుకుంటాయి. ఇదంతా మామూలే. విశాఖ రాజకీయాల్లో వైసీపీకి ఎదురులేదు. మేయర్ కూడా వైసీపీ నాయకుడే. దీంతో టీడీపీ నాయకులు మౌనం వహిస్తున్నారు. తెలుగుదేశానికి నేతలు లేక కాదు వారి లెక్కలు కుదరక. విశాఖ నగరాన్ని ప్రస్తుతం విజయసాయిరెడ్డి శాసిస్తున్నారు.
విశాఖలో పెద్ద జలాశయం ఉంది.మదసర్లోవ డ్యాం నుంచే విశాఖ వాసులకు మంచినీరు లభిస్తుంది. ఈ జలాశయం చుట్టూ 70 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్లోఅందమైన పార్కుని నిర్మించాలని వైసీపీ నిర్ణయించింది. పీపీపీ విధానంలో వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే పేరుకు పార్కు నిర్మాణం కానీ వందల కోట్ల విలువైన భూముల మీదనే వైసీపీ నేతలు కన్ను వేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ టీడీపీ మాత్రం గట్టిగా దీని మీద పోరాడలేకపోతోంది.
టీడీపీ జనసేనతో కలిసి బాణాలు సంధిస్తున్నావైసీపీ మాత్రం జడవడం లేదు. పార్కు నిర్మాణం అంటే అభివృద్ధిలో భాగమే. అయితే ఈ ప్రాజెక్టుపై అవకతవకలు ఉంటే వాటిని బయట పెట్టేందుకు టీడీపీ నాయకులకు ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే గతంలో ఈ భూముల మీద తెలుగు తమ్మళ్లకు కూడా ఆశ ఉండేదట. దీంతో వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారయింది పరిస్థితి. టీడీపీ నేతలు ఇలాగే ఉంటే మొత్తం విశాఖ నగరమే వైసీపీ చేతుల్లో ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అధికార పార్టీని ఢీకొనే సమర్థత ఉన్న నాయకులు కావాలి. గతంలో మాజీ ఎంపీ పబ్బం హరి వైసీపీపై ఎదురుదాడికి దిగేవారు. పైగా స్థానికుడు కావడంతో ఆయన మాటకు అందరు భయపడేవారు. విజయసాయిరెడ్డి నుంచి జగన్ వరకు అందరి మీద విమర్శలు చేసిన ఘనత ఆయనదే. ఇప్పుడు విశాఖలో ఉన్న వాళ్లంతా వలస వచ్చిన వారే. దీంతో వారు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. మొత్తానికి హరి లేని లోటు టీడీపీకి స్పష్టంగా కనిపిస్తోంది.