TDP Media Coordinator Darapaneni Narendra: థర్ట్ డిగ్రీ..పేరు మోసిన వాంటెడ్ క్రిమినల్స్ విషయంలో పోలీసులు ప్రయోగించే ఒక ప్రత్యేక చర్య. అయితే ఫ్రెండ్ లీ పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ డిగ్రీకి కాలం చెల్లింది. ఇప్పుడు దేశంలో ఎక్కడా ఈ మాట వినిపించడం లేదు. ఒక్క ఏపీలో తప్పించి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులను హింసించడానికి వైసీపీ సర్కారు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందన్న అపవాద మూటగట్టుకుంది. అయితే ఆ పార్టీ సొంత ఎంపీ రఘురామకృష్ణంరాజుపైనే ప్రయోగించడంతో ఇది అపవాదు కాదు.. నిజంగానే ప్రయోగిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీచేసి గెలుపొందిన రఘురామరాజు కొద్దిరోజులకే అధిష్టానంతో విభేదాలు తెచ్చుకున్నారు. అటు తరువాత ఏపీ పోలీస్, సీఐడీని ప్రయోగించిన వైసీపీ సర్కారు ఎన్ని విధాల హింసించిందో అందరికీ తెలిసిందే.

తాజాగా తెలుగుదేశం పార్టీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కేసులో సీఐడీ కీలక అధికారి ప్రమేయం ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది. దీనిని నరేంద్ర ఫార్వర్డ్ చేసినట్టు కన్ఫర్మ్ చేసిన సీఐడీ అధికారులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ను రాత్రంతా చిత్రహింసలు పెట్టినట్టు బాధితుడు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ‘మఫ్టీలో ఉన్న ఐదుగురు సీఐడీ సిబ్బంది రాత్రంతా కొట్టారు. రక్తం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఝండూబామ్ రాసి మరీ వాతలు పెట్టారు. గుంజీలు తీయించి, రెండు కాళ్లూ విడదీసి థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు బాధితుడు న్యాయమూర్తి ఎదుట కన్నీరుమున్నీరయ్యాడు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి తక్షణం వైద్యపరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆ నివేదకల ఆధారంగానే రిమాండ్ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీఐడీ రాజకీయ పల్లకి మోస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ సర్కారు జేబు సంస్థగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న వారందరిపైనా సీఐడీ కన్నేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు వచ్చిన మరుక్షణం వాలిపోతోంది. అదే సమయంలో విపక్ష నాయకులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. దానిపై ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అటు విపక్ష నాయకులను వెంటాడి మరీ కేసులు నమోదుచేయిస్తోంది. అర్థరాత్రి నోటీసులిచ్చి ఆ మరుసటి రోజే మంగళగిరి ప్రధాన కార్యాలయానికి రమ్మంటోంది. రోజంతా విచారణ పేరుతో కాలయాపన చేస్తోంది. మొత్తానికైతే ఏపీలో సీఐడీవ్యవహార శైలి జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.