రాష్ర్టంలో సరైన విధంగా వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా రోగుకు ధైర్యం చె ప్పి ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న చికిత్స, సౌకర్యాలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులు వెళ్తే వచ్చినష్టమేంటి? సీఎం గడప దాటి బయటకు రారు, ప్రజలకు అందుతున్న సేవల్ని పరిశీలించరు. వారికి భరోసా ఇచ్చేందుకు టీడీపీ నేతలు వెళ్తే అరెస్టు చేయడమేంటి? ముఖ్యమంత్రి ఆస్పత్రులను ఎందుకు సందర్శించడం లేదు? ప్రజల ఆరోగ్యంపై సీఎంకు బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
ఏడాదిగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి ప్రభుత్వం చేసింది శూన్యమే అని చెప్పాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు సైతం అందుబాటులే లేవని బాబు గుర్తు చేశారు. 45 ఏళ్లు నిండిన వారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. నిరుపేద రోగుల నుంచి సైతం రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ కరువైంది. శ్మశానాల్లో టోకెన్లు తీసుకుని ఖననం చేసుకునే పరిస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు.
కరోనా రక్కసిని నిర్మూలించడంలో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. సరైన రీతిలో వైద్యం అందక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇతర రాష్ర్టాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిపక్ష నేతల అరెస్టులను చంద్రబాబు ఖండించారు.