
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటి వరకు సరైన మందు కనిపెట్టలేకపోయారు వైద్యులు. అయితే.. తాను కనిపెట్టానంటూ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. చాలా మందికి అందించారు. ఆ మందు చాలా మంచిదని, కరోనాను ఇట్టే అంతం చేస్తోందని ప్రచారం కావడంతో.. దేశంలోని వివిధ ప్రాంతాల జనం ఆనందయ్య ఇంటి ముందు క్యూ కట్టారు.
అయితే.. ఈ మందు విషయంలో పంచాయతీ మొదలైంది. కొందరు ఈ మందు భేషుగ్గా పనిచేస్తోందని అంటుంటే.. మరికొందరు దీనికి శాస్త్రీయత లేదని అంటున్నారు. మెడికల్ మాఫియానే ఇలా ప్రచారం చేస్తోందని, వారి దోపిడీని ఆనందయ్య మందు అడ్డుకుంటుండడం వల్లే.. దుష్ప్రచారం చేస్తున్నారని మద్దతుదారులు అంటున్నారు. కరోనాకు మందు దొరికితే అంతకు మించిన ఆనందం ఏముందని, తాము మందును నిరూపించాలని మాత్రమే కోరుతున్నామని అంటున్నారు విమర్శకులు.
దీంతో.. వివాదం తారస్థాయికి చేరింది. గొడవ తీవ్రం కావడంతో.. మందు పంపిణీ నిలిపివేయడం.. ఆయుష్, ఐసీఎంఆర్ బృందాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఆనందయ్య మందు హానికరం కాదని ఆయుష్ తేల్చింది. ఐసీఎంఆర్ బృందం పరిశీలించాల్సి ఉంది. అయితే.. కరోనాకు మందు లేకపోవడంతో ఆనందయ్య మందు అమూల్యమైనదిగా మారిపోయింది. ఈ మందు కరోనాకు ఎంత మేర పనిచేస్తుందని తెలియని వాళ్లు కూడా సూపర్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు.
అంతేకాకుండా.. అల్లోపతి వైద్యవిధానాన్నే తప్పుబడుతున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ప్రపంచం ఎన్నో ప్రమాదకర రోగాలను తట్టుకొని నిలబడిందంటే.. అది అల్లోపతి వైద్యం ద్వారానే. ఇంగ్లీష్ మందులు లేకపోతే ఈ ప్రపంచ మనుగడ సాగించడం కష్టసాధ్యమన్నది అతిశయోక్తి కాదు. ఈ వైద్య విధానాన్ని అడ్డుపెట్టుకొని మెడికల్ మాఫియా డబ్బులు పోగేసుకోవడం నిజమే కావొచ్చు. దాన్ని ఆపాల్సింది ఎవరు.. ప్రభుత్వాలు కదా? అప్పుడు జనం డిమాండ్ చేయాల్సింది ఎవరిని? ప్రభుత్వాలను కదా? ఈ పని చేయకుండా ఎలుకను చంపడానికి ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా.. వైద్యవిధానాన్ని తూలనాడటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజంగా.. ఆనందయ్య మందు కరోనాను నాశనం చేస్తే.. అంతకు మించిన ఆనందం ఏముంటుందీ? అయితే.. ఈ నిజాన్ని ప్రభుత్వం తేల్చాలి. దీనికోసం జనం ప్రభుత్వాన్ని కోరాలి. ఇవన్నీ చేయకుండా.. ఇంగ్లీష్ మెడిసిన్ సరైనది కాదని వ్యాఖ్యానించడం.. దాన్ని దూరం పెట్టుకోవడం వల్ల అంతిమంగా నష్టం కలిగేది జనాలకేనని గుర్తించాలని అంటున్నారు.