TDP Leader : భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్టు వ్యవహరిస్తుంటారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. అయితే ఇది చాలా సందర్భాల్లో చేసి చూపించారు. పార్టీ అన్న.. అధినేత అన్న విధేయత చూపించడంలో అయ్యన్నను ఎవరూ శంకించలేరు. పార్టీ కష్టకాలంలో వెన్నండి నడిచే కీలక నాయకుల్లో ఆయనా ఒకరు. అందుకే చంద్రబాబు తనకంటే జూనియర్ అని సంభోదించినా.. తోటి పార్టీ నాయకులపై అయ్యన్ననోరు పారేసుకున్నా అధినేత భరిస్తూ వస్తున్నారు. పార్టీలో అయ్యన్నతో పాటు ఆ కుటుంబానికి పెద్దపీట వేస్తూ వచ్చారు. అయ్యన్న కుమారుడు విజయ్ ను ఐటీడీపీ బాధ్యతలు కూడా అప్పగించారు. ఎన్నికల్లో ఓటమి తరువాత అయ్యన్న, ఆయన కుమారుడు విజయ్ యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి విజయ్ ఇప్పుడు కనిపించకపోయేసరికి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారుట. అయ్యన్న దూకుడు కనబరుస్తున్నా విజయ్ కి ఏమైందని ఆరా తీస్తున్నారుట.
ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడంలో తండ్రితో పోటీ పడుతుంటారు విజయ్. గతంలో సీఎం జగన్ భార్యపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై సీఐడీ పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నర్సీపట్నంలోని ఆయన ఇంటికి 41ఏ నోటీసులతో వెళ్లారు. కానీ విజయ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులందించారు. గతంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో విజయ్ 41ఏ నోటీసులు అందుకున్నారు. తరువాత న్యాయస్థానానికి వెళ్లి ఉపశమనం పొందారు. అయితే జగన్ సర్కారు చర్యలతో అయ్యన్న కుటుంబం ఇబ్బందిపడిన మాట వాస్తవం. సోషల్ మీడియా ద్వారా తన సేవలను వినియోగించుకుంటున్న చంద్రబాబు, లోకేష్ లు తనకు చేసిందేమీ లేదని విజయ్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వ్యూహాత్మకంగా మౌనం పాటించినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో విజయ్ జాడ కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంపై పెద్దఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో సోషల్ మీడియాపరంగా క్యాష్ చేసుకోవాల్సి ఉన్నా విజయ్ సైలెంట్ గా ఉండడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారుట. ఇప్పటికే లోకేష్ కు మద్దతుగా ఎల్లో మీడియా మొత్తం మొహరించింది. కానీ విజయ్ చూస్తున్న సోషల్ మీడియా యాక్టివ్ గా పనిచేయకపోవడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం.
అయితే విజయ్ వ్యూహాత్మక మౌనం వెనుక గంటా శ్రీనివాసరావుతో లోకేష్ భేటీయే కారణమన్న ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. ఒకే పార్టీలో ఉన్నా వారు పప్పూ నిప్పులా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా.. గంటా పెద్దగా యాక్టివ్ లేరు. జగన్ సర్కారు నుంచి ఎదురయ్యే కేసుల దాడులు తట్టుకోలేక ఆయన పక్కచూపులు చూసినట్టు వార్తలు వచ్చాయి. అటు చంద్రబాబు, లోకేష్ లకు సైతం ముఖం చూపెట్టడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి తిరిగి పార్టీలో యాక్టివ్ కావడానికి గంటా లోకేష్ కు దగ్గరయ్యారు. అయితే ఇది అయ్యన్న కుటుంబానికి మింగుడుపడడం లేదు. అందుకే విజయ్ అస్త్రసన్యాసం చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సమస్యను చంద్రబాబు, లోకేష్ లు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరీ.