BJP-TDP Alliance : బిజెపితో పొత్తా? మద్దతా? నేడు టిడిపి కీలక ప్రకటన

వాస్తవానికి తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొంది. బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది.

Written By: NARESH, Updated On : October 29, 2023 8:37 pm
Follow us on

BJP-TDP Alliance : తెలంగాణలో బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుంటుందా? బిజెపి, జనసేన, టిడిపి కలిసే వెళ్తాయా? పోటీ నుంచి టిడిపి తప్పుకోవడం అన్న ప్రచారం ఉత్తదేనా? అసలు తెలంగాణ టిడిపిలో ఏం జరుగుతోంది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో టిడిపికి నాయకత్వం లేకపోయినా క్యాడర్ ఉంది. ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాల గెలుపోటములకు టిడిపి క్యాడర్ కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు టిడిపి నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.

చంద్రబాబు ముందు చూపుతో వ్యవహరించి తెలంగాణ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని సిద్ధం చేయాలని చూశారు. సీనియర్ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ కు ఆహ్వానించి మరి టిడిపి పగ్గాలు అప్పగించారు. ఒకటి రెండు సభలతో పాటు పార్టీ కార్యక్రమాల వేగం పెరిగింది. క్యాడర్ కూడా యాక్టివ్ గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ ప్రభావం తెలంగాణ టిడిపి పై పడింది. దీంతో ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. వాటన్నింటికీ తెరదించుతూ తెలంగాణలో టిడిపి పోటీ చేస్తుందని తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును జ్ఞానేశ్వర్ కలిశారు. తెలంగాణలో పోటీ చేయకపోవడమే ఉత్తమమని చంద్రబాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ విభిన్నంగా స్పందించారు. తాము పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీనిపై లోకేష్ ఆదివారం కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తెలంగాణలో పోటీ విషయంలో ఏదో జరగరానిది జరుగుతోందని అనుమానం ఉంది. అది బిజెపితో పొత్తా? లేకుంటే మద్దతా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే టిడిపి ప్రకటన బట్టే తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే లోకేష్ ప్రకటన కోసం తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి.

వాస్తవానికి తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొంది. బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. అయితే బిఆర్ఎస్ దూకుడుగా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వెనుకబడిన బిజెపి తెలుగుదేశంతో పాటు జనసేన ను తన రూట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది పొత్తు ద్వారా కాకుండా.. ఆ రెండు పార్టీలను పోటీకి దూరంగా ఉండేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఏపీలో రాజకీయ ప్రయోజనాలను ముడిపెట్టి.. తెలంగాణలో తమకు సహకరించాలని బిజెపి కోరుతున్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ఎటువంటి ప్రకటన చేస్తారోనని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.