TDP – Janasena Manifesto : ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమి దూకుడు పెంచింది. ఉమ్మడి మేనిఫెస్టోను ఇరు పార్టీలు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో.. రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు పవన్ నేరుగా చంద్రబాబును పరామర్శించి తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు. ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణ తక్షణం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే జనసేన సమన్వయ కమిటీని ప్రకటించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీని సైతం ప్రకటించింది.
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు.. ఇరు పార్టీల మధ్య తొలి సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగింది. జనసేన తరఫున పవన్ కళ్యాణ్, టిడిపి తరఫున లోకేష్ సారథ్యం వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో దిశగా అడుగులు వేశారు. అటు తరువాత విజయవాడ వేదికగా రెండో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోకేష్ తో పాటు నాదేండ్ల మనోహర్ సారధ్యం వహించారు.అటు జనసేన నుంచి మేనిఫెస్టోలో కీలక ప్రతిపాదనలు వచ్చాయి.ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో ప్రకటిద్దామని ఇరు పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా మూడో సమన్వయ కమిటీ సమావేశం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సంక్షేమముతో కూడిన అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారు. టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, పట్టాభి హాజరయ్యారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ పై చర్చించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన ఐదు అంశాలను చేర్చి.. ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను తీసుకొని పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందించారు. దీనికి తప్పకుండా ప్రజామోదం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటుకు 10 లక్షల రూపాయల వరకు రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతి రాజధాని కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళిక రూపకల్పన, బీసీలకు రక్షణ చట్టం, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలు, రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునః పరిశీలన వంటిని మినీ మేనిఫెస్టోలో చేర్చారు. దీనిపై ఉమ్మడిగా ముందుకు పోవాలని నిర్ణయించారు.