TDP Janasena Alliance: ఏపీలో ఇప్పుడు కీలక రాజకీయ అంశం.. టిడిపి, జనసేన మధ్య పొత్తు. అయితే ఇది అంత వేగంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గత కొన్ని రోజులుగా దోబూచులాడుతూ వస్తున్న ఈ పొత్తుల అంశం.. చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని శరవేగంగా జరిగిపోయింది. రెండు పార్టీల మధ్య సమన్వయానికి తొలి భేటీ సైతం రాజమండ్రిలో విజయవంతంగా పూర్తయింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటనలో.. రెండు విషయాల్లో పవన్ పై సాధించారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఇచ్చేలా పొత్తు ప్రకటించారు. నమ్మదగిన మిత్రుడిగా గుర్తింపు సాధించారు. అప్పటివరకు జనసేన ను మిత్రుడు గానే భావించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. ఈ ఒక్క చర్యతో పవన్ ను తమ వాడిగా చూసుకుంటున్నారు. అప్పటివరకు సీట్లు పరంగా జనసేనకు తక్కువ చేసిన వారే.. ఎక్కువ సీట్లు ఇచ్చినా పర్వాలేదు అన్న నిర్ణయానికి వచ్చారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సజావుగా జరిగేలా రెండు పార్టీల మధ్య మంచి వాతావరణాన్ని సృష్టించడంలో పవన్ సక్సెస్ అయ్యారు.
చంద్రబాబు అరెస్ట్ కు ముందు జనసేన సీట్లకు సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. 15 సీట్లు అని.. 20 సీట్లు దాటవని.. మరి మించితే 25 లోపేనని రకరకాల విశ్లేషణలు జరిగాయి. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 40 సీట్లని, 50 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని కొత్త విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయంలో పవన్ వ్యూహాత్మకంగా పనిచేశారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అటు నమ్మదగిన మిత్రుడుగా అనిపించుకోవడంతో పాటు వారి అభిమానంతో సీట్లు పెంచుకోనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట.
రెండు మూడు జిల్లాల్లో బలమైన ప్రాంతాల్లో జనసేనకు టికెట్లు కేటాయిస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జనసేనకు టికెట్లు కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడే పది చోట్ల తమకు సర్దుబాటు చేయాలని జనసేన వర్గాలు ఒక నివేదిక టిడిపికి ఇచ్చినట్లు తెలుస్తోంది. 52 సీట్లలో 10 సీట్లు అడుగుతున్నారంటే.. మిగతా 123 సీట్లలో ఏ స్థాయిలో డిమాండ్ చేస్తారో తెలియంది కాదు. తెలుగుదేశం పార్టీని ఆదుకుంటూనే.. పవన్ పట్టు బిగించారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఒక వ్యూహంతోనే పవన్ పొత్తు ప్రకటన చేశారని స్పష్టమవుతోంది.