
TDP- Janasena: ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ఏపీలో టీడీపీ పరిస్థితి. జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైపోయిందని.. పవన్ మావాడండే మావాడు అని ఊరూ వాడా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన జెండాలు పట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన అవగాహన వచ్చింది. పార్టీ నిలబడాలంటే పవన్ వల్లే సాధ్యమని తేలిపోయింది. పవన్ ను ముందుపెట్టి వెళ్లకుంటే మాత్రం ప్రజలు నమ్మరని తేలిపోయింది. అందుకే పవన్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కానీ పవన్ వైపు నుంచి ఆశించినంత మొగ్గు కనిపించలేదు. కానీ జగన్ సర్కారు చర్యలు పుణ్యమా అని చంద్రబాబును పవన్ పలకరించాల్సిన అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయి.
అయితే పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలన్న కృతనిశ్చయంతో కనిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కారుకు సుమారు రెండేళ్ల పాటు గడువు ఇచ్చారు. అంతవరకూ ఓపికగానే ఉన్నారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం, పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనిపించడం, సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని లూటీ చేయడం, అప్పుల రాష్ట్రంగా మార్చేయ్యడం తదితర కారణాలతో జగన్ సర్కారుపై పోరాటం చేశారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు చర్యలు మరింత మితిమీరడంతో పవన్ సవాల్ చేశారు. అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటానికి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో? చూస్తానని సవాల్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని కూడా స్పష్టం చేశారు.
దీనిని అవకాశంగా మలుచుకున్న చంద్రబాబు తన పెద్దరికాన్ని పక్కనపెట్టి మరీ పవన్ కోసం ఎదురెళ్లారు. దీంతో పవన్ కూడా కొంత సానుకూలంగా కనిపించారు. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తుకు అవసరమైన అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇటువంటి సమయంలోనే చంద్రబాబు తనలో ఉన్న పాత రాజకీయ క్రీడను తెరపైకితీశారు. పవన్ తో కలుస్తూనే జనసేన పార్టీ భాగస్వామ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పవన్ ను ముందుంచి టీడీపీ లబ్ధిపొందేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో జనసేనకు మైలేజ్, సంఖ్యాబలం లేకుండా చేయాలన్నదే వ్యూహం.

అయితే ఇటువంటి విద్యలో ఆరితేరిన ఎల్లో మీడియాకు చంద్రబాబు టాస్క్ ఇచ్చారు. చంద్రబాబు పవన్ ను కలిస్తే పతాక శీర్షికలో కథనాలు. అదే పవన్ ప్రభుత్వ వైఫల్యాలను అజెండాగా తీసుకొని పోరాడితే మాత్రం ఏదో మూలన వార్త. అసలు జనసేనకు బలమే లేదని.. అది టీడీపీతో కలిస్తేనే లోక కళ్యాణమని.. మరెవరితోనూ కలిసిన అది వ్యభిచారమే అన్నట్టు రాతలు రాసి జనసైనికుల స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారికి పవన్ మాత్రమే కావాలి. కానీ జనసేన బలం పెరగకూడదు. ఇప్పుడు అదే అభిమంతో ఎల్లోమీడియా పనిచేస్తోంది. ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు..కనికట్టు రాతలతో జన సైనికుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తోంది.
కొత్తగా టీడీపీ ఒక కొత్త పల్లవి అందుకుంది. చంద్రబాబు, లోకేష్ ల నుంచి దిగువస్థాయి నేతల వరకూ పవన్ నామస్మరణ లేనిదే ప్రసంగాలు సాగడం లేదు. మొన్నటికి మొన్న లోకేష్ పాదయాత్ర తన ప్రసంగంలో సింహభాగం పవన్ కే కేటాయించారు. పవన్ లాంటి మంచి వ్యక్తిని తాను 2014లో చూశానని చెప్పారు. అటువంటి వారు రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు. అటు చంద్రబాబు వైఖరి కూడా అలానే ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలపై మాట్లాడే ప్రతీసారి పవన్ ప్రస్తావన తీసుకొస్తారు. పవన్ ను అడ్డుకోవడానికి మీరెవరు అని ప్రశ్నిస్తుంటారు. మొత్తానికైతే టీడీపీ మాత్రం పవన్ ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇది ఒకరకమైన వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు.