TDP: చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల మధ్యకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో.. సిఐడి రిమాండ్ రిపోర్టులో అన్ని అసత్యాలనే పొందుపరిచిందని టిడిపి భావిస్తోంది. సిఐడి చేసిన ఆరోపణలు సత్యదూరమని నిరూపించేందుకు ప్రత్యేక బుక్ లెట్లతో వివరణాత్మకంగా పొందుపరిచింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టిడిపి తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. తన తండ్రి అక్రమ అరెస్టుపై గట్టిగానే పోరాడుతున్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించగానే.. ట్విట్టర్ వేదికగా లోకేష్ భావోద్వేగ ప్రకటన చేశారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్ళతో.. ఈరోజు ఇది రాస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు లోకేష్.. ” ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన శక్తిని ధార పోయడం చూస్తూ పెరిగా, లక్షలాదిమంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజు అంటూ తెలియదు, ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయితీగా ఉంటాయి” అని పేర్కొన్నారు. అనంతరం” సేవలను పొందిన వారి ప్రేమ, కృతజ్ఞతలు నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశా. వాళ్ల కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి. అవి పిల్లల ఆనందానికి సమానమైనవి. నేను ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్ కు తిరిగి వచ్చా” అంటూ మరో ట్వీట్ చేశారు. ఏపీ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం తిరుగులేని శక్తితో మేము ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా అని లోకేష్ పిలుపునిచ్చారు.
మరోవైపు ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి వస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ పై కేసుల సమయంలో ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మాదిరిగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చంద్రబాబు చుట్టూ జరుగుతున్న కుట్రలు, కేసుల గురించి ప్రజలకు వివరిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలుగుదేశం నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును అక్రమ అరెస్టులు చేస్తూ, కేసులు నమోదు చేస్తున్న తీరును ప్రజలకు వివరించగలిగితే సత్ఫలితాలు వస్తాయని టిడిపి నేతలు భావిస్తున్నారు.
మరోవైపు లోకేష్ తన పాదయాత్రను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన 3000 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. మరో వెయ్యి కిలోమీటర్లు మాత్రమే పెండింగ్లో ఉంది. చంద్రబాబు కేసులు కొలిక్కి వచ్చిన తర్వాత.. వీలైనంత త్వరగా పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని సమాచారం. అటు నందమూరి, ఇటు నారా కుటుంబ సభ్యులు మొత్తం రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు కేసుల విషయంలో గట్టిగానే ప్రతిఘటించాలని తెలుగుదేశం పార్టీకి ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.