TDP Alliances: రాబోయేది ఎన్నికల కాలం. గెలుపు దరి చేరడానికి పొత్తులు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం. ‘‘ఒంటరిగా పోటీ చేస్తాం’’ అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తమాటే. లోపాయికారీ ఒప్పందాలు జరగకపోతే పని గడవదు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుందా?, ఏ పార్టీతో కలిసి నడవాలో తెలియక సతమతమవుతుందా?, బీజేపీతో జత కట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందా?, కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఎందుకు వెనకాడుతోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీజేపీకి దగ్గరగానే ఉంది. 2014లో ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది. గెలిచిన తరువాత బీజేపీ ఎమ్మెల్యేలకు తన క్యాబినేట్ లో చంద్రబాబు చోటు కల్పించారు. రాష్ట్రం విడిపోవడం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ వ్యతిరేకించారు. అప్పటి నుంచి బీజేపీ కూడా తెలుగు దేశం పార్టీకి దూరంగా జరగడం ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికి ఎన్నికల్లో గెలుపొందేందుకు సహకారం అందించింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీ విషయంలో సైలెంట్ అయిపోయారు.
నిన్నా మొన్నటి వరకు బీజేపీకి ఎదురు లేదని అనుకుంటున్న తరుణంలో రాహుల్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రత్నామ్నాయంగా అవతరించింది. కర్ణాటకలో విజయం అనంతరం దేశం మొత్తం గెలిచేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల రూపొందించుకుంటుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉంది. వైసీపీ లోపాయికారీగా బీజేపీతో కలిసున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ ఆటోమేటిగ్గా కాంగ్రెస్ కు దగ్గరవ్వాలి. కానీ, చంద్రబాబు నాయుడు ఆ మేరకు నిర్ణయం తీసుకోలేకపోతుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
బీజేపీతో పవన్ కల్యాణ్ ఒక్కరే పొత్తు పెట్టుకొని ఉన్నారని ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ బీజేపీతో జట్టు కట్టేందుకు సుముఖత చూపుతున్నారు. కానీ, ఆ పార్టీ నాయకులెవరూ ఈ విషయంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధపడటం లేదు. రాబోవు ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్నా, ఆ విషయంపైనా టీడీపీ క్లారిటీ ఇవ్వడం లేదు. పొత్తు విషయాన్ని త్వరగా తేల్చితే, పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులు అలక పాన్పు ఎక్కుతారనే బహుశా భయమై ఉండవచ్చు.