Badvel bypoll: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికపై ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరిలో ఆసక్తి పెంచింది. ఇప్పటికే జనసేన పోటీ చేయడం లేదని స్పష్టతనివ్వడంతో టీడీపీ తప్పుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రం ఇంకా పోటీలో ఉన్నట్లే అని చెబుతోంది. ఈ నేపథ్యంలో బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ అనివార్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట పోటీకి సై అన్నా తరువాత మనసు మార్చుకుని టీడీపీ పోటీ నుంచి నిష్ర్కమించడం తెలిసిందే.

పదవిలో ఉన్న నేతలు చనిపోతే అక్కడ వారి కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వడం సంప్రదాయం. దీన్ని ఏపీలో కొనసాగిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం నంద్యాలలో ఈ సంప్రదాయానికి గండి కొట్టింది. దీంతో టీడీపీ మొదట పోటీలో ఉండాలని భావించినా తరువాత మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తప్పుకుంటుందని అందరు ఆశించినా తాము పోటీలో ఉన్నామని ప్రకటించింది. దీంతో ఇక్కడ పోటీ తప్పనిసరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించి కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని చెబుతున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ పోటీలో ఉండడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బద్వేల్ లో ద్విముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మించింది తామేనని బీజేపీ చెబుతోంది.
ఎన్నికల సంఘం అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అప్పగించింది. గతంలో కంటే బ్రహ్మాండమైన ఓటింగ్ శాతం రావాలని ఆకాంక్షిస్తున్నారు. దీంతో బీజేపీ కూడా ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.