Telugu Desam Party: ఆ పార్టీ ఆవిర్భావమే దేశ రాజకీయాల్లో ఒక కొత్త ఆవిష్కరణం. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఓ ప్రభంజనం. ఢిల్లీ పీఠాలను కదిలించినా, సొంత పార్టీలో సంక్షోభాలు ఎదుర్కొన్నా నాలుగు దశాబ్దాల పాటు పడిలేస్తూ.. లేచిపడుతూ నిలబడింది తెలుగుదేశం పార్టీ. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు చేతిలో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇంతింతై వటుటింతై అన్న చందంగా ఎదిగింది. ఢిల్లీ తంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలను తట్టుకొని నిలిచింది. 40 వసంతలు పూర్తి చేసుకుంది. తెలుగు వారి జీవితాలపై చెరగని ముద్ర వేసుకుంది. జాతీయ పార్టీలు తప్ప ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేని ప్రస్తుత తరుణంలో నాలుగు దశాబ్దాల పాటు తన ఉనికిని చాటుకుంటోంది. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో నలిగిపోయిన రాష్ట్రాన్ని చూసి ఎన్టీఆర్ చలించిపోయారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టడాన్ని సహించలేకపోయారు. అందుకే సమర భేరీ మొగించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పిలస్తోంది..రా.. కదలి రా అంటూ నినదించి తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతోనే ఎంతోమంది విద్యాధికులు తమ చేయిని కలిపారు. బడుగు బలహీన వర్గాల వారు చేరువయ్యారు. సామాన్యులు సైతం ఎన్టీఆర్ తో అడుగులు వేశారు. దాని ఫలితమే అక్కడు తొమ్మిది నెలల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దేశ రాజకీయ యవనికపై కొత్త అధ్యయనాన్ని స్రుష్టించింది. ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. కిలో రెండు రూపాయలకు బియ్యం అందించడం, పట్వారి వ్యవస్థ రద్దు, గ్రుహ నిర్మాణం వంటి వాటితో ఎన్టీఆర్ జనరంజకమైన పాలన అందించారు. అప్పటివరకూ కప్పం కట్టడమే తప్ప సంక్షేమం అన్న మాట ఎరుగని తెలుగు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు.
తెలుగుదేశం పార్టీతో వందలాది మంది వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందారు. ఒక విధంగా చెప్పాలంటే నేతలను తయారుచేసే ఫ్యాక్టరీగా తెలుగుదేశం పార్టీ రూపుదిద్దుకుంది. ఎంతమంది నాయకులు వచ్చినా తనలో ఇముడ్చుకుంది. ఉభయ రాష్ట్రాల్లో ప్రస్తుతం కీలక ప్రజాప్రతినిధులుగా వెలుగొందుతున్న వారిలో ఎక్కువ మంది పూర్వశ్రమం తెలుగుదేశం పార్టీయే. రాజకీయ సైద్ధాంతిక విభేదాలతో పార్టీని విమర్శించవచ్చు కానీ.. వారి నాయకత్వాన్ని ప్రోత్సహించింది మాత్రం తెలుగుదేశం పార్టీయే అన్న విషయం వారికి విధితమే. తన నలబై సంవత్సరాల ప్రయాణం తెలుగుదేశం పార్టీకి నల్లేరుపై నడక కాదు. ఎన్నో సంక్షోభాలను చవిచూసింది ఆ పార్టీ. ప్రతీ విజయం వెనుక ఒక సంక్షోభం ఉంది. 1983లో తిరుగులేని విజయం సాధిస్తే నాదేండ్ల భాస్కరరావు రూపంలో సంక్షోభం ఎదుర్కొంది. అప్పుడే ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగారు. ఆ తరువాత ఎన్నికలు 1989లో ఓటమి ఎదురైంది. అయినా మొక్కవోని దీక్షతో ఎన్టీఆర్ 1994 ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చారు. అటు తరువాత లక్ష్మీపార్వతీ ప్రవేశంతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఇక పార్టీ ఉంటుందా? ఉండదా అన్న అనుమానం వెంటాడింది. ఎన్నో విమర్శలు ఎదురైనా చంద్రబాబు నాయకత్వంలోకి పార్టీ వచ్చింది. అధికారంలోకి రాగలిగింది. ప్రతిపక్షంగాను కీలక పాత్ర వహించింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి గుర్తింపు తప్ప..నాయకుడు ఎవరన్నది ముఖ్యం కాదన్నది తేటతెల్లమైంది.
Also Read: AP Politics Communist Party: కమ్యూనిస్టులకు దారేది? ఎవరితో కలుస్తారు?
తెలుగుదేశం పార్టీని అంతం చేయాలన్న కుట్ర ఆవిర్భావం నుంచీ ఇప్పటివరకూ కొనసాగుతునే ఉంది. ఢిల్లీ ప్రమేయంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నాదేండ్ల భాస్కరరావు భారీ స్కెచ్ వేశారు. కానీ ఆయన పాచిక పారలేదు. అప్పటికీ తెలుగుదేశం పార్టీ పట్ల, ఎన్టీఆర్ పట్ల తెలుగు ప్రజలకు అభిమానం తగ్గలేదు. ఫలితంగా ప్రజా తిరుగుబాటే వచ్చింది. ఎన్టీఆర్ ప్రజా పరిరక్షణ యాత్రకు విశేషస్పందన లభించింది. ఇది చూసిన నాదేండ్ల భాస్కరరావు పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అప్పట్లో ఢిల్లీ పీఠంపై ఎన్టీఆర్ గర్జన దేశ ప్రజల మనసును దోచుకుంది.
ఇందిరాగాంధీ నుంచి నేటి జగన్ వరకూ అందరూ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చూసిన వారే. రాష్ట్ర విభజనతో టీడీపీ అడ్రస్ గల్లంతు చేయడానికి ప్రయత్నించారు. కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసే అరుదైన అవకాన్ని ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. వాస్తవానికి టీడీపీకి ఇంత ఆదరణ పుణ్యం ఎన్టీఆర్ ది అయితే తన రాజకీయ వ్యూహ చతురత, ముందుచూపుతో చంద్రబాబు పార్టీని కాపాడుకో గలిగారు. తాము కష్టాల్లో ఉన్నామని ప్రజలు గుర్తిస్తున్న నాడు టీడీపీ ప్రభుత్వాన్నే కోరుతున్నారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్ గా 13 జిల్లాల ప్రజలు నడి రోడ్డున నిలబడ్డారు. ఆ సమయంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అయితేనే గాడిలో పెట్టగలదని నమ్మి ప్రజలు అవకాశమిచ్చారు. అదే సమయంలో కడుపు నిండిన వారి ఆశలు తీర్చలేక వారికి దూరమవుతోంది. ఓటమి దశకు చేరుకుంటోంది. 2014, 19 మధ్య మెరుగైన పాలన అందించినా ప్రజలు సంక్షేమాల వరాల జల్లునే కోరుకున్నారు.
ప్రతీ రాజకీయ పార్టీకి ఒక ఏజెండా ఉంటుంది. ప్రజలను జాతి, వర్గం, కులాలుగా విభజించి రాజకీయంగా ఎదగాలని రాజకీయ పార్టీలు ఆకాంక్షిస్తాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మైనస్ అనే చెప్పవచ్చు. విభజన రాజకీయాలకు టీడీపీ ఎప్పుడూ ప్రొత్సహించలేదు. ఒక్క వెనుకబడిన తరగతులను మాత్రం అక్కున చేర్చుకున్న ఘనత టీడీపీదే. బీజేపీ హిందుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రాంతీయవాదాన్ని, వైసీపీ కమ్మ కుల వ్యతిరేక భావనను రెచ్చగొట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నాయి. టీడీపీ మాత్రం ఈ విభజన మంత్రాన్ని తలకెక్కించుకోలేదు. ప్రజలను విడదీసే ప్రయత్నం చేయలేదు. ఎప్పటిలాగే టీడీపీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. పోరాట బాట పట్టింది. తాము కష్టాల్లో ఉన్నామని ప్రజలు భావిస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుంది. ఒకటి మాత్రం చెప్పగలం. తెలుగువారు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తనతో పాటు టీడీపీ పోతుందన్న ఎన్టీఆర్ మాటలను ఉటంకిస్తూ..ఆయన మరణానంతరం రెండున్నర దశాబ్దాల పాటు పార్టీ బతికిందంటే.. టీడీపీకి పార్టీ బలమే తప్ప నాయకత్వం కాదని నిరూపితమైంది. మొన్న ఎన్టీఆర్, నేడు చంద్రబాబు, రేపు ఎవరైనా, ఎవరున్నా పార్టీ మాత్రం కొనసాగుతుంది.
Also Read: Pawan Kalyan Kapu Community : కాపులను కలుపుకొని ఐక్యతగా వెళ్లటమే పవన్ విజయానికి ఉన్న ఏకైక మార్గమా?
Recommended Video: