TDP Janasena Alliance: తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అరుదైన రికార్డు ఆ పార్టీది. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ప్రాంతీయ పార్టీలకు టిడిపి ఒక దారి చూపింది. తెలుగువారి ఆత్మగౌరవం అన్న నినాదంతో.. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించించారు నందమూరి తారక రామారావు. 1983లో టిడిపి విజయం సాధించింది. 1984 మధ్యంతర ఎన్నికల్లోను కుట్రలు,కుతంత్రాలను దాటి మరోసారి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. దేశ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పొత్తులపై ఆధారపడడం విశేషం. తొలి ఎన్నికల్లోనే మేనకా గాంధీ సంజయ్ విచార్ మంచ్ లాంటి చిన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు పొత్తుల ద్వారానే మంచి ఫలితాలను సాధించగలిగింది.
అయితే ఎక్కువ కాలం భారతీయ జనతా పార్టీతోనే టిడిపి పొత్తులు కొనసాగించింది. అటు వామపక్షాల సేవలను సైతం వినియోగించుకుంది. 1999, 2004 ఎన్నికల్లో బిజెపితో కలిసి నడిచింది. 1999 లో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. 2004లో చతికల పడింది. 2009లో వామపక్షాలతో పాటు టిఆర్ఎస్తో మహా కూటమి ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో సైతం ఓటమి చవి చూసింది. 2014 ఎన్నికల్లో బిజెపి, జనసేన తో కలిసి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. 2019లో తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకే 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులకు తెరతీయాలని చాలా రోజుల కిందటే చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కలిసి నడిచేందుకు పవన్ సిద్ధమయ్యారు. అటు బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మంచి నాయకత్వం ఉంది. అయినా సరే సొంత బలాన్ని నమ్ముకోలేకపోతోంది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో రాణించినా.. తెలుగుదేశం పార్టీకి ఇది లోటే. అందుకే ప్రత్యర్థులు సైతం తరచూ విమర్శలు చేస్తుంటారు. పొత్తులు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేస్తుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. పొత్తును ఒక సెంటిమెంట్ గా మాత్రమే తీసుకుంటుంది.