
Pawan Kalyan- AP MLC Elections 2023: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన విపక్షాలు టీడీపీ, బీజేపీ తమ అభ్యర్థులను బరిలో దించాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా పవన్ పనిచేస్తున్నారు. అయితే అది విపక్షాల ఐక్యతతోనే సాధ్యమని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పొత్తులు అనివార్యమని చెబుతున్నారు. కానీ టీడీపీ గూటికి బీజేపీ రావడానికి ఇష్టపడడం లేదు. అయినా ఎన్నికల వరకూ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు పవన్ డిఫెన్స్ లో పడిపోయారు. ఎవరికి మద్దతు తెలపాలో తెలియక సైలెంట్ గా ఉన్నారు.
ఏపీలో తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, మూడు పట్టభద్రుల స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 23 వరకూ నామినేషన్ల స్వీకరణ, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి మెజార్టీ ఉండడంతో ఆ పార్టీ ఖాతాలో ఆ స్థానాలన్నీ పడనున్నాయి. అయితే ఈసారి టీడీపీ, బీజేపీ సైతం అభ్యర్థులను బరిలో దించాయి. పట్టుచూపాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం పోటాపోటీ నెలకొంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అక్కడ బీజేపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ సునాయాసంగా విజయం సాధించింది. అయితే ఈసారి అధికార వైసీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ను, టీడీపీ మాజీ అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును బరిలో దించాయి. అధికార పార్టీ కావడంతో వైసీపీ అభ్యర్థి దూకుడును కనబరుస్తున్నారు. బీజేపీ, టీడీపీలు మాత్రం ఎవరికి వారుగా పవన్ కళ్యాణ్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన పెద్దగా రెస్పాండ్ కావడం లేదు.

అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాధవ్ అంటూ ప్రకటన చేశారు. కానీ పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీకి సపోర్టుచేస్తే బీజేపీతో ఉన్న బంధం తెంచుకున్నట్టేనని నిర్థారణ అవుతోంది. అలాగని బీజేపీకి మద్దతు ప్రకటిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదన్న సంకేతాలు పంపించినట్టవుతుంది. ఫలితంగా అది వైసీపీకి లాభిస్తుంది. అందుకే ఈ విషయంలో పవన్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. కానీ టీడీపీ, బీజేపీ అగ్రనేతలు రంగంలో దిగారు. ఒత్తిడి చేస్తుండడంతో పవన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
