
AP MLC Elections- YCP: ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, మూడు పట్టభద్రుల స్థానాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గవర్నర్ కోటా కింద మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 23 వరకూ నామినేషన్ల స్వీకరణ, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు తప్పించి.. మిగతావన్నీ అధికార వైసీపీ దక్కించుకునే చాన్స్ ఉంది. అందుకే ఎక్కువ మంది ఆశావహులు తమ అభ్యర్థిత్వాలను పరిగణలోకి తీసుకోవాలని హైకమాండ్ కు విన్నవిస్తున్నారు.
ఇప్పటికే శాసనమండలిలో సంపూర్ణ ఆధిక్యతను దక్కించుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకొని సంఖ్యాబలం పెంచుకోవాలని భావిస్తోంది. స్థానిక సంస్థలతో పాటు ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలను కూడా దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తోంది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ కసరత్తు పూర్తిచేసినట్టు తెలిసింది. సామాజిక సమీకరణలు, అభ్యర్థి సీనియార్టీ, పార్టీ ఆవిర్భావం నుంచి అందించిన సేవలు, గత ఎన్నికల్లో త్యాగాలు, వచ్చే ఎన్నికల్లో ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది., ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ బృందం నివేదికల ఆధారంగా బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి పెద్దపీట వేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
స్థానిక సంస్థ సీట్లకు సంబంధించి నెల్లూరు నుంచి మేరీ గ మురళీధర్ (గూడూరు), కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మల మడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్తు రామారావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లా నాయకత్వాలను సంప్రదించి ఫైనలైజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో ఒకరికి, బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే చాన్స్ దక్కని చాలామంది నాయకులు ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెంచుకున్నారు. అటువంటి వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంది, అచీతూచీ నిర్ణయాలు తీసుకోకుంటే మాత్రం అధికార వైసీపీలో ఇబ్బందిక పరిస్థితులు తలెత్తే అవకాశముంది.
