TDP: మేమెప్పుడు ప్రజల పక్షం. అధికారంలో ఉన్నా..విపక్షంలో ఉన్నా ప్రజల కోసమే మా ఆరాటం. నాలుగు దశాబ్దాలు పడిలేస్తూ వచ్చాం. కిందపడ్డాం.. కలబడ్డాం.. నిలబడ్డాం. సంక్షోభాలు కొత్త కాదు. విజయాలు తలకెక్కలేదు.. ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ అప్పుడు పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు అన్నది ఆయన గ్రహించలేకపోతున్నారు. అపార రాజకీయ చాణుక్యుడి ఇప్పుడు ఆ రెండు మీడియాల మాటును తన పరిణితి ప్రదర్శించలేకపోతున్నారు. ఇంకా భ్రమల్లోనే ఊరేగుతున్నారు. వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. ప్రజా పోరాటాలు చేయకుండా ప్రజలు ఎలా గుర్తిస్తారన్న లాజిక్ ను సైతం మిస్ అవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై నూటికి నూరు శాతం వ్యతిరేకత మాట వాస్తవం. అయితే దానినే తమ బలమన్నట్టు టీడీపీ వ్యవహరిస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఎక్కడా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. అంతేకాదు.. క్షేత్రస్తాయిలో పార్టీ పుంజుకునేలా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో కీలక నేతలు ప్రెస్ మీట్లు, జూమ్ మీటింగులు పెట్టి అంతా సవ్యంగా సాగుతున్నట్టు బిల్డప్ చేస్తున్నారు. తామకు తాము సంత్రుప్తి ప్రకటిస్తున్నారు. ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’లో వండి వార్చి వచ్చే కథనాలను చూసి తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. ఒక సారి బయటకు వచ్చి చూస్తే జగన్ సర్కారుపై ఎంత వ్యతిరేకత ఉందో గ్రహించలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలే తమను గెలిపించుకుంటారన్న భ్రమలో ఉన్నారు. క్షేత్రస్తాయిలో జగన్ సర్కారుపై యుద్ధం చేయడంలో ఎక్కడా.. వ్యూహాత్మకంగా అడుగులు వేసిన దాఖలా కనిపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది.
తిరోగమన దిశలో పాలన సాగిస్తొంది. ఒక్క సంక్షేమం తప్ప అభివ్రద్ధి జాడలేదు. ఎడపెడా పన్నులు పెంచుకుంటూ పోతోంది. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టి.. ప్రజల్లోకి వచ్చింది లేదు. ఈ పరిణామాలపై టీడీపీ కార్నర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఆదిశగా బలమైన అడుగులు వేస్తున్నట్టు కనిపించలేదు. జగన్ సీఎం అయిన తర్వాత.. ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏదో నాలుగు మాటలు అనేసి కార్యాలయాలకు పరిమితమయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రజల్లోకితీసుకువెళ్లి ప్రజా ఉద్యమంగా మలిచే పని మాత్రం చేయలేకపోతున్నారు.
వేసవి ప్రారంభం నుంచే విద్యుత్ కోతలు ప్రతాపం చూపుతున్నాయి. మరో వైపు విద్యుత్ చార్జీల పెంపు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ రూపంలో పోరాటాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిపై బలమైన పోరాటం చేయాలన్న ఆరాటం టీడీపీ నాయకుల్లో కనిపించడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలు డీజిల్ చార్జీలు పెరిగిపోతున్నా యి. వీటి వల్ల .. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటిని కూడా టీడీపీ పెద్దగా పట్టించుకున్నపాపాన పోలేదు. ఇక సామాన్య మధ్యతరగతి కట్టుకునే ఇళ్లకు సైతం ఇసుక లభించని దుస్థితి రాష్ట్రంలో ఉంది. మౌలిక వసతులు లేక ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోడ్లు బాగాలేదు. కాలువలను శుభ్రం చేయలేదు. కొత్తగా నిర్మాణలంటూ ఏవీ లేవు.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. వీటిపై సర్కారుకు వ్యతిరేకంగా.. ప్రజలను సమీకరించి.. ఆందోళనలు.. చేయాల్సిన టీడీపీ.. రాజకీయంగా బలోపేతం అవ్వాల్సిన టీడీపీ.. ఎక్కడా ఆదిశగా అడుగులు వేయకపోవడం గమనార్హం. ఇదొక్కటే కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అప్పులు చేస్తూనే పాలన చేస్తోంది. రూపాయి ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థతిపై కేంద్రంలోని అధికారులు కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం శ్రీలంక అయినా.. ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు.
కానీ ఈ విషయాన్ని కూడా టీడీపీ ఇలా పట్టుకుని.. అలా వదిలేసింది. బలంగా ప్రశ్నించింది లేదు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగడం లేదు. రోడ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఈ పనులు కూడా మందగిస్తున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ టీడీపీననేతలు ఒకరిద్దరు.. మీడియా ముందుకు వచ్చి నాలుగు డైలాగులు పేల్చి.. ఇంటికే పరిమితమవుతున్నారు తప్ప.. ప్రజా ఉద్యమాలనను నిర్మించే స్థాయిలో మాత్రంవారు పనిచేయడం లేదు. పార్టీ పరిస్థితి అంతాబాగుందనే అనుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ ఇంచార్జ్లు ఎక్కడా తిరగడం లేదు. ప్రతి ఇంచార్జ్ కూడా వాళ్ల వాల్ల నియోజకవర్గంలో ప్రెస్ మీట్కు పరిమితం కావడం.. తెల్లవారి తమ ఫొటో.. పేపర్లలో వచ్చిందో రాలేదో చూసుకోవడం వరకే పరిమితం అవుతున్నారు. ఇలా చేయడం.. వల్ల.. టీడీపీ పుంజుకునేనా?? అంటున్నారు పార్టీ అభిమానులు.
Web Title: Tdp away from public struggles
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com