YS Sharmila : కడప ఎంపీగా షర్మిల పోటి? టిడిపి, జనసేన మద్దతు?

అది షర్మిల పోటీ చేస్తే మాత్రమే ఆ ఫార్ములాను ఆ మూడు పార్టీలు అనుసరించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: NARESH, Updated On : January 16, 2024 5:13 pm

YS Sharmila

Follow us on

YS Sharmila  : వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయనున్నారా? కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగనున్నారా? క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కడప జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పాటు తటస్తులు, వైసిపి చోటా నాయకులకు టచ్ లోకి వెళ్లారు. ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అదే కానీ జరిగితే కడప జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైసీపీ సిట్టింగ్ ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన మరోసారి పోటీలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అది ఏమంత ప్రభావం చూపదని వైసిపి హై కమాండ్ భావిస్తోంది. అందుకే మరోసారి అవినాష్ రెడ్డికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే అవకాశంగా షర్మిల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా షర్మిల ఎంపీగా పోటీ చేస్తే కడపలో పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా షర్మిల పోటీ చేస్తే.. టిడిపి, జనసేన ఏం చేస్తాయన్నది ప్రశ్న. వీలైనంతవరకు అక్కడ కూటమి తరుపున అభ్యర్థిని బరిలోదించకుండా.. షర్మిల కు మద్దతు తెలిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టిడిపి జనసేన కూటమి అభ్యర్థి బరిలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. వైసీపీకి లాభించే అవకాశం ఉంది. అప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీ కావడం ఖాయం. అలాకాకుండా అవినాష్ గెలుపును అడ్డుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికను నియంత్రించాలి. అలా ఓట్లలో చీలిక రాకూడదంటే టిడిపి, జనసేన, కాంగ్రెస్ మధ్య అవగాహన తప్పనిసరి. అయితే ఆ మూడు పార్టీల లక్ష్యం జగన్ ఓటమి. అందుకే అవినాష్ వ్యతిరేకంగా మూడు పార్టీలు చేతులు కలవక తప్పదు. అది షర్మిల పోటీ చేస్తే మాత్రమే ఆ ఫార్ములాను ఆ మూడు పార్టీలు అనుసరించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.