TDP Janasena Alliance: టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ అభినందనలు అందుకుంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో సత్ఫలితాన్నిస్తోంది. కేవలం వైసీపీ సర్కార్ చర్యలతో బాధితులుగా మిగిలిన.. చాలా వర్గాలకు చేయూతనందించేలా ఈ మేనిఫెస్టో ఉంది. జగన్ పాలనలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రం 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా టిడిపి, జనసేన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ప్రజల్లో ఆలోచన తెచ్చే విధంగా మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ఇసుక విధానంలో అస్పష్టత నిర్మాణ రంగానికి గుదిబండగా మారింది. ఫలితంగా కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇసుక అనేది ఒక ఖరీదైన వస్తువుగా మారింది. దీనికి ముమ్మాటికి జగన్ సర్కార్ వైఖరే కారణం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్లలో ఇసుక కొరతతో నిర్మాణరంగం నిరసించింది. ఉపాధి లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదేరంగానికి ఊతమివ్వాలని టిడిపి, జనసేన నిర్ణయించుకోవడం విశేషం. ఉమ్మడి మేనిఫెస్టోలో ఇసుక ఉచిత విధానంపై నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం.
తొలిసారిగా జరిగిన ఉమ్మడి మేనిఫెస్టో సమావేశంలో రెండు పార్టీలు కలిసి 11 అంశాలతో మినీ మేనిఫెస్టో పై ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో పథకాలను ప్రకటించింది. జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలను సైతం అంగీకారం తెలిపారు. ముఖ్యంగా జగన్ పాలనలో బాధిత వర్గాలుగా మిగిలిన వారికి అండగా నిలవాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో లేని సమస్యలను జగన్ సర్కార్ సృష్టించింది. వాటికి పరిష్కార మార్గం చూపడంతో పాటు వ్యవస్థలను గాడిలో పెడతామని ఈ రెండు పార్టీలు చెబుతుండడం విశేషం. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆలోచన తేవాలని రెండు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
ఉచిత సంక్షేమ పథకాలు కంటే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పి.. వారి సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యంగా చాటి చెప్పాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి ప్రజల్లో ఉచిత పథకాలపై ఉన్న ఆసక్తిని తగ్గించి.. నిజమైన సమస్యలపై ఫోకస్ పెట్టించాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం, కార్మిక వ్యవస్థ పై దృష్టి పెట్టడం. సంపన్న ఏపీ పేరుతో రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయడం.. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తూ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేయడం గొప్ప విషయం గా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కూటమికి తప్పకుండా విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. అందుకే ఈ నెల 17 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి.