Luxury Cars In Hyderabad: కర్ణాటక హడావిడిలో మీడియా పట్టించుకోవడం లేదు కానీ.. కారు పార్టీ ఏలుతున్న తెలంగాణలో లగ్జరీ కార్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.. అంతేకాదు వీటిని కొనుగోలు చేసిన ఓనర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయం హై ప్రొఫైల్ వ్యక్తులది కావడంతో చాలా రహస్యంగా ఉంచుతున్నారు.. అయితే ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి అధికారులు ఎంత గోప్యంగా ఉంచుదామనుకున్నా అది ఆగలేదు. బట్టబయలైంది.
లగ్జరీ కార్లు దిగుమతి అవుతున్నాయి
కారణాలు ఏమున్నప్పటికీ గత దశాబ్ద కాలం నుంచి హైదరాబాదులో ఆగర్భ శ్రీమంతులు పెరిగిపోతున్నారు. ఆడి కారు వస్తేనే బాబోయ్ అని కళ్ళు అప్పగించి చూసిన హైదరాబాద్ జనాలకు…ఇప్పుడు కోట్ల విలువచేసే ఫెరారీ కార్లు కూడా దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి పూట హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఈ తరహా కార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతటి విలాసవంతమైన కార్లకు వాటి ఓనర్లు దిగుమతి పన్నులు చెల్లించారు అనే విషయంపై అధికారులకు సందేహాలు తలెత్తాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు మౌనం వహించగా, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు తీగ లాగుతుంటే లగ్జరీ కార్ల డొంక మొత్తం కదులుతోంది.. అయితే ఈ కార్లను కొనుగోలు చేసిన పెద్ద పెద్ద వ్యక్తులకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది.. వీటిని కొనుగోలు చేసిన వారి ఆదాయ వ్యవహారాలను ఓ కంట కనిపెడుతోంది.. కోట్లు విలువచేసే ఈ విలాసవంతమైన కార్లలను బినామీ పేర్లతో బడా బాబులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. “విలాసవంతమైన కార్లు కొని పెద్ద పెద్ద వ్యక్తులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టారు. అయితే ఈ కుంభకోణంలో కేసినో కింగ్ గా ప్రసిద్ధి చెందిన చికోటి ప్రవీణ్ ప్రమేయం ఉన్నట్టు మాకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.. ఆ దిశగా మేము కేసు దర్యాప్తు చేస్తున్నాం.. ప్రవీణ్ తో పాటు నసీర్, మోసీన్ అనే వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చాం.. నిన్న( మే 15న) ప్రవీణ్ ను విచారించాం. అతడు చెప్పిన వివరాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నాం.. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎక్కువగా ఉన్నారు” అంటూ ఈడీ అధికారి ఒకరు చెప్పారు.
గతంలోనూ..
ఇక ఇలాంటి విలాసవంతమైన కార్లకు సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.. విదేశీ రాయబారుల పేరుతో ఖరీదైన కారులను దిగుమతి చేసుకొని పన్నులు ఎగ్గొట్టిన వ్యవహారంపై ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు ” ఆపరేషన్ మాటే కార్లో” పేరుతో 2021లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నగరానికి చెందిన కొంతమంది వ్యక్తులు ముంబై ముఠా నుంచి కార్లు కొనుగోలు చేసినట్టు అధికారుల విచారణలో తేలింది.. అయితే ఇవన్నీ కూడా టాక్స్ లు కట్టకుండా కొనుగోలు చేసినవే. గడిచిన ఐదు సంవత్సరాలలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం లోని పోర్టుకు 50 వరకు విలాసవంతమైన కార్లు దిగుమతి అయ్యాయి.. అయితే వీటిలో చాలా కారులను హైదరాబాదులోనే అమ్మారు.
అధికార పార్టీ నాయకులు, సినీ తారలు
అయితే సాధారణంగా విలాసవంతమైన కారులను ప్రజా ప్రతినిధులు, సినీ తారలు కొనుగోలు చేస్తూ ఉంటారు.. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి విలాసవంతమైన కార్లను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కీలక ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.. ఇలాంటి వాహనాలకు భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.. కారు అసలు విలువపై 204 శాతం దిగుమతి సుంకం కింద ప్రభుత్వానికి కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది.. మన దేశంలోని విదేశీ రాయబారులకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
అయితే దీనినే పెద్ద పెద్ద వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంతేకాదు ఆ వాహనాలను మారుమూల ప్రాంతాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. చికోటి ప్రవీణ్ చెప్పిన ఆధారాల ప్రకారం పెద్ద పెద్ద వ్యక్తులు భారీగా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని మారుమూల రవాణా శాఖ కార్యాలయాల్లో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ మరింత లోతుల్లోకి వెళ్లి విచారణ జరిపితే పెద్దపెద్ద వ్యక్తుల విలాసవంతమైన కార్ల కొనుగోలు బండారం బయటపడుతుందని మేధావులు అంటున్నారు.