NTR 100 Rupees Coin: టిడిపి వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల వెండి నాణాన్ని నేడు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని మోడీ సర్కార్ ఈ నాణాన్ని ముద్రించింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నాణెం విడుదల కానుంది. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందింది. కుమారులు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్లు ఇలా అందరూ ఢిల్లీ వెళ్లారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. వారు హాజరవుతారా? లేదా? అని ఆసక్తికరమైన చర్చ అయితే మాత్రం నడుస్తోంది.
కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు. అటు ఎన్టీఆర్ కుమార్తె, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కార్యక్రమానికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ భార్యగా ఉన్న తనను ఆహ్వానించకపోవడంపై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె రాష్ట్రపతి భవన్ అధికారులను ప్రశ్నించారు కూడా. ఎన్టీఆర్ కు సంబంధించి ఎటువంటి కార్యక్రమం అయినా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరుతూ వస్తున్నారు. అయితే అన్నింటికీ మించి ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తున్నారా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అటు విజయవాడతో పాటు హైదరాబాదులో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ తారక్, కళ్యాణ్ రామ్ ఎక్కడా కనిపించలేదు. జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్లో కనిపించిన ఆ ఇద్దరు ఆ తరువాత పెద్దపెద్ద కార్యక్రమాల్లో కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం వల్లే వారిద్దరూ దూరంగా ఉండిపోయారని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ వర్గాలే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో తప్పకుండా హాజరవుతారని అంతా భావిస్తున్నారు. కానీ వారి రాకను ధ్రువీకరించే ఏ వార్త బయటకు రాలేదు.
ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాదులోనే జరుగుతోంది. ఎన్టీఆర్ కు బిజీ షెడ్యూల్ ఉండడంతో కార్యక్రమానికి వెళ్లే అవకాశాలు లేనట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్కరోజు సినిమా షూటింగ్ ఆపి.. తాత గారి కార్యక్రమానికి వెళ్లాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఆఖరి నిమిషంలో నైనా తారక్ కార్యక్రమానికి హాజరవుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.