Thammineni Seetharam : తాను ముందు ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేను.. తరువాత స్పీకర్ ను.. నేను ఏమైనా మాట్లాడొచ్చు. రాజకీయాలు చేసుకోవచ్చని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తరచూ మాట్లాడుతుంటారు. మంత్రి పదవిపై ఆశపడి అయిష్టతగానే స్పీకర్ అయిన తమ్మినేని పదవి చేపట్టిన నాటి నుంచే తానో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని మరిచి వ్యవహరించారు. తొలినాళ్లలో అయితే రివ్యూల మీద రివ్యూలు చేశారు. రాజకీయ వేదికలను పంచుకున్నారు. అదేమని ప్రశ్నిస్తే సమర్థించుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలకు, వ్యాఖ్యానాలకు కొదువలేదు. అయితే ఆయన ఉన్నపళంగా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఏదో చేయకూడని తప్పు వల్లే ఆయన మౌనాన్ని ఆశ్రయించారని టాక్ వినిపించింది. ఇంతలోనే ఆయనపై ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలు వెలుగుచూశాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇదో సంచలనంగా మారింది.
వివరాలు సేకరించిన టీడీపీ..
తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరిన విషయం తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. ఆయన చదివానని చెబుతున్న నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ దగ్గర్నుంచి యూనివర్శిటీ వరకూ అన్ని వివరాలు సేకరించింది. కానీ చర్యలకు అటు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించలేదు. వైసీపీ సర్కారుతో ఉన్న సన్నిహితం కారణంగా నకిలీ డిగ్రీ ఇచ్చిన తమ్మినేనిపై కానీ.. లా అడ్మిషన్ ఇచ్చిన కాలేజీపై కానీ..ఆ స్టడీసెంటర్ పై కానీ ..ఎక్కడా ఒక్క కేసు నమోదు కాలేదు. ఫేక్ సర్టిఫికెట్లు వెలుగుచూస్తే వెంటనే చర్యలకు దిగుతారు. సంబంధిత యూనివర్సిటీ తక్షణం రంగంలోకి దిగుతుంది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ తమ్మినేని విషయంలో ఇవేవీ జరగలేదు. ఎందుకంటే ఆయన జగన్ సర్కారులో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి.
ఆ బాధ్యత లేదా?
ఈ గుట్టు టీడీపీ నేతలు బయటపెట్టారు కనుక లైట్ తీసుకున్నట్టున్నారు. కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ తమ్మినేని సీతారాం ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు రాష్ట్రాల విద్యాసంస్థలకు సంబంధాలున్నాయి. అత్యున్నత వ్యక్తే నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే.. ఇంకా ఇలాంటి ఫేక్ ను ఎంతమంది అనుసరిస్తున్నారో అన్నది అనుమానం కలుగుతోంది. దీనిని నివృత్తి చేయడంతో పాటు నియంత్రించాల్సిన బాధ్యత ఉభయ తెలుగు ప్రభుత్వాలపై ఉంది. అసలు నకిలీ డిగ్రీ ఎవరు తయారు చేశారు?.. ఎందుకుతయారు చేశారు?.. ఇలా ఎన్ని సర్టిఫికెట్లు తయారు చేశారన్నదానిని నిగ్గుతేల్చాలి. అదే చేస్తే ఉభయ రాష్ట్రాల్లో చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మూల్యం తప్పదా?
టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసి కోడెల శివప్రసాదరావుకు వైసీపీసర్కారు వచ్చాక ఏ పరిస్థితి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన్ను వెంటాడి వేటాడి చిత్రవధ చేశారు. బలవన్మరణానికి పురిగొలిపారు. ఆయన ఎపిసోడ్ చూసైనా తమ్మినేని పద్ధతిగా వ్యవహరించాలి. కానీ అలా చేయడం లేదు. తనపై ఈగవాలనీయని వైసీపీ ప్రభుత్వం ఉంది. పక్కన సన్నిహిత సంబంధాలున్నా కేసీఆర్ సర్కారు ఉంది. కానీ ఎన్నాళ్లు.. ఒకచోట ప్రభుత్వం చేతులుమారినా తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్ల అంశం తిరగతోడే అవకాశముంది. అందుకే తమ్మినేని జరిగిన దానికి క్షమాపణో.. లేకుంటే తనపై తాను దర్యాప్తు వేయించుకోవడమో ఉత్తమమని విశ్లేషకులు సహా ఇస్తున్నారు.