సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లు ప్రణాళికబద్దంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కొనియాడారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవి. ఇప్పుడు విద్యుత్ కోతలను అధిగమించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమాతో భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు.
కేసీఆర్ పక్కా ప్రణాళికలతో సమస్యలను అధిగమించి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ. 1,00,116 ఇస్తున్నాం. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితి పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గవర్నర్ ప్రకటించారు. రైతు సమన్వయ సమితి ఇక నుంచి రైతు బంధు సమితిగా మారనుంది అని గవర్నర్ తెలిపారు. రైతులను సంఘటితం చేయడమే రైతు బంధు సమితి ఉద్దేశమని చెప్పారు.
విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతు బంధు సమితి కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు.
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నది అని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది. శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుందని గవర్నర్ ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజులవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేవిధంగా ప్రభుత్వం సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసిందని ఆమె వివరించారు.
విద్యుత్త్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించిందని గవర్నర్ కొనియాడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగం అధికంగా కలిగిన రాష్ట్రంగా నిలబడి ఉందని చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడితే, తెలంగాణ రాష్ట్రంలో అంతకుమించి, 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని వెల్లడించారు.