Tamil Nadu Minister Senthil Balaji: ఈడీ సోదాలు, అరెస్టు: గుక్క పెట్టి ఏడ్చిన మంత్రి: రాష్ట్రవ్యాప్తంగా కలకలం

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకంగా 18 గంటల పాటు విచారించారు. బుధవారం ఉదయం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.

Written By: Bhaskar, Updated On : June 14, 2023 1:43 pm

Tamil Nadu Minister Senthil Balaji

Follow us on

Tamil Nadu Minister Senthil Balaji: తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఇదే సూత్రాన్ని తమిళనాడు రాష్ట్రం మీద ప్రయోగించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. మొన్న తమిళనాడు రాష్ట్రంలో పర్యటించిన ఆయన తమిళుడిని ప్రధానమంత్రిని చేయాలని కోరిక ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్ నుంచి ఆయన మంత్రివర్గం దాకా హర్షించారు. చప్పట్లు కొట్టి అమిత్ షాను అభినందించారు. కానీ ఇది జరిగి ఒకరోజు అయిందో లేదో తమిళనాడు రాష్ట్రం వార్తల్లో నిలిచింది. తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఇది మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం దాకా కొనసాగింది.. సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సెంథిల్ బాలాజీ చాంబర్ లో తనిఖీలు చేపట్టేందుకు సీఐఎస్ఎఫ్ దళాలతో సచివాలయానికి చేరుకున్న ఈడీ అధికారులను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. నీతో సిఐఎస్ఎఫ్ జవాన్లను అక్కడే ఉంచిన అధికారులు.. మంత్రి చాంబర్ కు వెళ్లి మూడు గంటల పాటు తనిఖీ చేశారు. అదేవిధంగా బాలాజీ అధికారిక నివాసంతో పాటు ఆయన కుటుంబానికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, సోదరుడి నివాసంలో కూడా ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అయితే ఇది సోదాల వరకే పరిమితం అవుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ ఎపిసోడ్లో బుధవారం ఉదయం తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మంత్రి బాలాజీని అరెస్టు చేసింది. ఇది ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మనీలాండరింగ్ కేసులో..

మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకంగా 18 గంటల పాటు విచారించారు. బుధవారం ఉదయం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓ మందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకోగానే సెంథిల్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని బిగ్గరగా ఏడ్చాడు. దీంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ చట్టం కింద అతడిని అరెస్టు చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అరెస్టును తమకు చెప్పలేదని డిఎంకె నేతలు అంటున్నారు. అరెస్టు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఆసుపత్రి వద్ద ఈడీ అధికారులు మోహరించారు..” బాలాజీని ఈడీ అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన స్పృహలో ఉన్నట్టు కనిపించడం లేదు.” అని డీఎంకే రాజ్యసభ ఎంపీ, న్యాయవాది ఎన్ ఆర్ ఇలాంగో తెలిపారు. ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. దీనిపై న్యాయపరంగానే పోరాటం చేస్తామని ఆయన వివరించారు. ఇక మంత్రిని 24 గంటలపాటు కస్టడీలో చిత్రహింసలు పెట్టారని, ఇది పూర్తిగా మానవ హక్కులకు విరుద్ధమని తమిళనాడు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి ఆరోపించారు. అంతేకాదు కోర్టుకు, ప్రజలకు ఈడీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

చాతి నొప్పితో..

ఇక, ఈడీ అధికారులు సెంథిల్ ను కస్టడీలోకి తీసుకున్నప్పుడు చాతిలో నొప్పిగా ఉందని, ఆయన బాధతో విలవిల్లాడారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. బిజెపి సారధిలోని కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని, తాము వాటికి భయపడబోమని అంటున్నాయి. మరోవైపు సెంథిల్ ను కలుసుకునేందుకు డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. రాష్ట్ర క్రీడలు, సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిది స్టాలిన్, ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్, ప్రజా పనులు, హైవేల శాఖ మంత్రి ఈవి వేలు, హెచ్ ఎం సి ఈ మంత్రి శేఖర్ బాబు, పలువురు డిఎంకె మద్దతుదారులు ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. బాలాజీ అరెస్టు పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, భారత రాష్ట్ర సమితి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను ప్రధానమంత్రి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించాయి. దీనిపై న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించాయి.