Tamannaah Bhatia : మన దేశంలో సినిమా నటులకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ వంటి వారు రాజకీయాలను కూడా శాసించారు.. వారు సాధించిన విజయాలు, తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తుగా పాఠ్యాంశాలలో వారి జీవిత విషయాలను పొందుపరిచారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే వారు సాధించిన విజయాలు అటువంటివి కాబట్టి. భావితరాలకు స్ఫూర్తిగా ఉంటాయని పాఠ్యాంశాల రూపకర్తలు అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ విషయం సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో సినీనటి తమన్నా గురించి ప్రస్తావించారు. ఆమె కోసం ఏకంగా ఒక పాఠ్యాంశాన్నే రూపొందించారు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం..” సింధు విభజన తర్వాత భారతీయ ప్రజల జీవితం” అనే పాఠ్యాంశంలో తమన్నా నటించిన సినిమాల వివరాలను ప్రస్తావించడం విశేషం. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..”మా పిల్లలకు జ్ఞానం అలవడేందుకు పాఠశాలకు పంపిస్తున్నాం. మీరేమో తమన్నా పై పాఠ్యాంశాలు రూపొందించారు. ఇలా అయితే పాఠశాలకు పంపించడం ఎందుకు.. నేరుగా ఇంట్లోనే తమన్నా సినిమాలు చూపిస్తే సరిపోతుంది కదా.. ఇంతోటి దానికి వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఏంటి” అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ విషయం అక్కడ మీడియాలో ప్రముఖంగా రావడంతో ఆ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం స్పందించింది. పాఠ్యాంశాలను రూపొందించడంలో ఎక్కడో చిన్న తప్పు జరిగిందని.. దానిని సరి దిద్దుతామని ప్రకటించింది..” విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే మా ఉద్దేశం. మా వద్ద సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారు. పాఠ్యాంశాలను బోధించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా కొత్త కొత్త కృతులలో పాఠ్యాంశాలను బోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ తప్పును సరిదిద్దుకుంటాం. తమన్నా గురించి ప్రస్తావించడం పట్ల చింతిస్తున్నామని” ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పేర్కొంది.