హైదరాబాద్ భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్ట్‌వేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న నగరం కూడా హైదరాబాద్. ఇక్కడ అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతున్నా.. ముంబై తరహాలో ఆకాశ హర్మ్యాలు లేని లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చేసేందుకు సిద్ధమైంది జీహెచ్‌ఎంసీ. త్వరలోనే ఈ మహానగరం ఆకాశ హర్మ్యాలకు నిలయంలా మారనుంది.
Also Read: కేటీఆర్ సీఎం ఫిక్స్.. ఫిబ్రవరి 7న కేసీఆర్ ప్రకటన?
అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 39 అంతస్తుల భవనం ఎత్తయినది కాగా.. ఇప్పుడు 46 అంతస్తుల నివాస సముదాయాలు నిర్మాణం కానున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సుమధుర ఈ ప్రాజెక్టుకు తాజాగా జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. నానక్‌రాంగూడలోని ఐదెకరాల స్థలంలో రెండు టవర్లుగా నివాస సముదాయాలు నిర్మించనుంది. మొత్తం 853 ఫ్లాట్‌లు ఇందులో ఉంటాయని పట్టణ ప్రణాళికా విభాగం అధికారి తెలిపారు. మరో టవర్‌లో కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కు, మినీ కన్వెన్షన్ సెంటర్ తదితర మౌలిక వసతులు కల్పించనున్నారు. 140 మీటర్లకుపైగా ఎత్తులో 46 అంతస్తుల భవనం నిర్మితం కానుంది. అలాగే, ఖాజాగూడ జంక్షన్ సమీపంలో ఎస్‌ఏఎస్ కంపెనీకి చెందిన 36 అంతస్తుల నివాస సముదాయాలకు కూడా జీహెచ్‌ఎంసీ తాజాగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?
గ్రేటర్ పరిధిలో పలు సంస్థలు ఇప్పటివరకు 40 అంతస్తుల లోపు భవనాలు నిర్మించాయి. ఇప్పుడా రికార్డులను తిరగరాస్తూ.. ఆకాశ హర్మ్యాలను నిర్మించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థలన్నీ ఐటీ కంపెనీలు, ఇతర కార్యాలయాలు ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి వైపే చూస్తున్నాయి. కానీ.. అన్ని ఏరియాల్లోనూ భారీ భవన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. కోవిడ్ ప్రభావం గ్రేటర్ రియల్ రంగంపై కొంతమేర కనిపిస్తోంది. నివాస సముదాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల దరఖాస్తులు బాగానే వస్తున్నా.. వాణిజ్య భవనాల ప్రాజెక్టులకు మాత్రం తగ్గాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అయితే.. ఆఫీసుల కోసం విక్రయించేందుకు, అద్దెకు ఇచ్చేందుకు నిర్మించే కమర్షియల్ స్పేస్ నగరంలో తగ్గుతోందని, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఏడాది క్రితం వచ్చిన దరఖాస్తులకు ఆమోదం తెలిపినా.. లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్న కొన్ని సంస్థలు ఫీజు చెల్లించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. ఆమోదం తెలిపి.. ఫీజు సమాచారం పంపినా ఇప్పటికీ చెల్లించని దరఖాస్తులు 20కి పైగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఇందులో అధిక శాతం వాణిజ్య నిర్మాణాలే అని చెప్పారు.