Homeఆంధ్రప్రదేశ్‌తలపట్టుకుంటున్న జగన్ అనుచరులు

తలపట్టుకుంటున్న జగన్ అనుచరులు

 

శాసనమండలి రద్దు నిర్ణయం జగన్ కి ముందు ముందు గుదిబండ లాగా తయారవబోతుందనిపిస్తుంది. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మండలినే రద్దు చేయటం తన మెడకే చుట్టుకుంటుందా అనిపిస్తుంది. దీనివలన తను సాధించేదేమీ లేకపోవటంతో తన పర్సనాలిటీ పై తన క్యాడరుకే సందేహం ఏర్పడే అవకాశముంది. 2007 లో వైస్సార్ శాసన మండలిని పునరుద్దరించినప్పుడు ముందే మాట్లాడుకొని చక చకా చక్రం తిప్పి పని చక్కపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు జగన్ అలా మోడీతో ముందే మాట్లాడుకొని చేసినట్లుగా అనిపించటం లేదు. ఒకవేళ మోడీ ఈ అసెంబ్లీ తీర్మానాన్ని చుట్టపెట్టి పక్కన పడిస్తే అందరిలో నగుబాటు కాక తప్పదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసన మండలి రద్దు తీర్మానం పార్లమెంటు ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలిని పునరుద్ధరించమని రాజస్థాన్, అస్సాం అసెంబ్లీలు చేసిన తీర్మానాలు ఆమోదానికి నోచుకోలేదు. 2018 లో కొత్తగా మండలిని ఏర్పాటుచేయమని ఒడిశా చేసిన తీర్మానం అక్కడే వుంది. 2013 లోనే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ శాసన మండలి ఏర్పాటు, రద్దు విషయంలో ఓ జాతీయ విధానం కావాలని నివేదిక సమర్పించింది. ఎప్పుడు బడితే అప్పుడు, కొత్త ప్రభుత్వాలు మండలిని రద్దు చేయకుండా ఈ విధానం కావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో మోడీ తక్షణం నిర్ణయం తీసుకుంటాడనుకోవటం లేదు. అసలు మోడీకి దీనిపై ఎటువంటి అభిప్రాయం వుందో తెలియదు. తన స్వంత రాష్ట్రం గుజరాత్ లో అసలు ఎగువ సభ లేదు. తన హయం లో అందుకోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.

ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఒక్కసారి ఆలోచిద్దాం. మండలి ఇప్పట్లో రద్దు కాదు. ఒకవేళ నిజంగా మోడీ సానుకూలంగా వున్నా అది జరగటానికి కనీసం సమయం పడుతుంది. ఎందుకంటే అది మోడీ ప్రాధాన్యతా అంశాల్లో ఉండదు కాబట్టి. ఈ లోపల మండలి తీర్మానం తిరిగి అసెంబ్లీ కి వస్తుంది. మూడు నెలల లోపల బిల్లు తిరిగి పంపించాల్సివుంది. ఆ తర్వాత అసెంబ్లీ మరలా మండలికి పంపించినా తిరిగి నెలలోపల వాపసు వచ్చేస్తుంది. అంటే నాలుగు నెలల తర్వాత జగన్ అనుకున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. అంటే మండలి రద్దు తీర్మానం కంటే ముందే రాజధాని సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని నెలలకు మూడింట ఒకవంతు మంది రిటైరవుతారు. జగన్ కి మండలి లో మెజారిటీ వస్తుంది. అప్పుడు మండలి రద్దయితే జగన్ అనుచరులే గొడవపెడతారు. చూస్తూ చూస్తూ కొరివితో తలా గోక్కున్నట్లయిందని జగన్ పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఎటూ ఇప్పుడు రద్దుకానిదానికి ఆవేశంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు. పిల్లచేష్టలులాగా ఉన్నాయని ఆయన అనుచరులే గగ్గోలు పెడుతున్నారు. దీన్నిబట్టి జగన్ ఆలోచనాపరుడా ఆవేశపరుడా అనే చర్చ జనంలో నడుస్తుంది. ఇటువంటివి రెండు మూడు జరిగితే జగన్ పరువు గంగలో కలిసి పోతుంది. తస్మాత్ జాగ్రత్త.

By తేజ

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular