T News: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాటి నుంచి భారత రాష్ట్ర సమితికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి, కెసిఆర్ ఆసుపత్రి పాలుకావడం, బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి షాపింగ్ మాల్ వ్యవహారం తెర పైకి రావడం, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సిఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించారు అనే ఆరోపణలు రావడం, ఆయన కుమారుడు సెక్రటేరియట్ ఎదురుగా డివైడర్ ను ఢీకొనడం వంటి పరిణామాలతో భారత రాష్ట్ర సమితి ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అధికార కాంగ్రెస్ వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేసి గులాబీ పార్టీని మరింత ఇరుకున్న పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఇది కారు పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన వాతావరణమే. ఈ తరుణంలో ఆ పార్టీకి మరింత చేదువార్త ఇది..
2004లో భారత రాష్ట్ర సమితి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయం కోసం బంజారాహిల్స్ లో ఎకరం భూమిని ఇచ్చారు. అత్యంత తక్కువ ధరకు దానిని అప్పుడు ఆ పార్టీకి ఇచ్చారు. వాస్తవానికి ఒక పార్టీ కార్యాలయం ఉన్నచోట అందులో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు చేపట్టకూడదు. కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి తెలంగాణ భవన్లో ఇన్ని రోజులపాటు టీ న్యూస్ నిర్వహించారు. అంతేకాదు ఆ భవనంలో ఆ చానల్ నిర్వహణ కోసం అనేక రకాల మార్పులు చేశారు. గతంలో దీనిపై మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండటంతో ఆ కేసు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. అప్పుడే ఆ కేసుకు సంబంధించి చలనం మొదలైంది.
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడంతో.. కోర్టు తెలంగాణ భవన్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసింది. వెంటనే తెలంగాణ భవన్ నుంచి టీ న్యూస్ కార్యకలాపాలను, దానికి సంబంధించిన సామాగ్రిని బయటకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు పార్టీ కార్యాలయంలో ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి కోర్టు ఏకీభవించేలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్ నుంచి టీ న్యూస్ ను మరో భవనంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది..
టీ న్యూస్ ఏర్పడక ముందు దానిని రాజ్ న్యూస్ పేరుతో ఉంచేవారు. అప్పట్లో టిఆర్ఎస్ సంబంధించిన ప్రసారాలు మొత్తం రాజ్ న్యూస్ పేరిట ఉండేవి. కొంతకాలానికి రాజ్ న్యూస్ కాస్త టీ న్యూస్ అయింది. ఈ టీ న్యూస్ కి 2014-15 కాలంలో దాదాపు 11 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం. ఇక 2015 నుంచి మొన్నటి వరకు భారీగానే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారని.. దీనిపై కూడా విచారణ జరిపించాలనే డిమాండ్లు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా సత్తా చాటాలి అని ఆలోచిస్తున్న నేపథ్యంలో.. టీ న్యూస్ కార్యాలయాన్ని తరలించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకత్వం తర్జనభర్జనలు పడుతోంది. అప్పుడంటే అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆటాడినా చెల్లుబాటయింది. ఇప్పుడు టీ న్యూస్ విషయంలో భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఏం చేస్తుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.