Budget 2024: భారత కొత్త పార్లమెంటు భవనంలో మొదటి బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రప్రతి ద్రౌపతి ముర్ము ప్రసంగించనున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపు ఇవే చివరి సమావేశాలు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. తర్వాత 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన ఎత్తివేశారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ అన్ని పక్షాలను కోరారు. అధికార బీజేపీతోపాటు 30 పార్టీలకు చెందిన 45 మంది సమావేశానికి హాజరయ్యారు. ఇది చిన్న సెషన్ అయినందున ఎవరూ ప్లకార్డులతో రావొద్దని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు.
చివరి సెషన్..
ప్రస్తుతం దేశంలో 17వ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో గడువు ముగియబోతోంది. ఈ నేపథ్యంలో చివరి పారల్మెంట్ సెషన్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందులో ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై పడింది. ఏప్రిల్–మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది.
సస్పెన్షన్లన్నీ ఎత్తివేత..
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశంలో మాట్లాడుతూ అన్ని సస్పెన్షన్లు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ధడ్‌కన్‌ను సస్పెన్షన్లు ఎత్తివేయాలని కోరారు. బడ్జెట్ సమావేశాలకు సభ్యులంతా హాజరయ్యే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. దీంతో స్పీకర్, చైర్మన్ ఇందుకు అంగీకరించారు.