Surat Husband Letter: ఆమధ్య బెంగళూరులో ఒక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక.. కోర్టు కేసులు ఎదుర్కోలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.. అతని ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత గృహహింస అనేది కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదని.. మగవాళ్ళ మీద అధికంగా ఉంటుందని తేలింది. ఇక అప్పటి నుంచి ఈ తరహా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కాస్త దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
తన భార్య వేధింపులు భరించలేకపోతున్నానని.. అందువల్లే తనకు కారుణ్య మరణాన్ని పొందే అవకాశం ఇవ్వాలని అతడు లేఖ రాశాడు. సూరత్ నగరానికి చెందిన కిరీట్ పటేల్ కు గతంలో రెండుసార్లు వివాహాలు జరిగాయి. 2024లో మూడవసారి అతడు వివాహం చేసుకున్నాడు. మొదట్లో వారిద్దరు బాగానే ఉండేవారు. ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మూడో భార్య అతడి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టేది. ఆమెకు అత్తగారు తోడయ్యారు. నిరంతరం డబ్బు కోసం అతడిని వేధించడం మొదలు పెట్టేవారు. అతడి జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. మొదటి రెండు పెళ్లిళ్లు పెడాకులు కావడం.. మూడవ వివాహం కూడా ఇలా మారిపోవడంతో అతడు తీవ్రమైన ఆవేదనలో కూరుకుపోయాడు.
కిరీట్ పటేల్ మీద అతడి భార్య రకరకాల కేసులు పెట్టింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. తన మాజీ భర్తల మీద కూడా ఆమె ఇదేవిధంగా కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసింది. కిరీట్ పటేల్ తాను ఎటువంటి తప్పు చేయలేదని పోలీసులకు చెబుతున్నప్పటికీ వారు ఒప్పుకోవడం లేదు. ఇదే విషయంపై అనేక పర్యాయాలు పోలీసులను కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. అతడిలో ఆవేదన మరింత పెరిగిపోయింది. ఒత్తిడి ఎక్కువ కావడంతో.. తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అతడు లేఖలో కోరాడు. “నాకు జీవితమేద పూర్తిస్థాయిలో విరక్తి వచ్చేసింది.. వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. వీటినుంచి బయటపడే మార్గం నాకు కనిపించడం లేదు. దయచేసి నాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అంటూ”కిరీట్ పటేల్ కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. గృహహింసకు మగవాళ్ళు బలైపోతున్నారని.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అతడు ఆ లేఖలో పేర్కొన్నాడు.
కిరిట్ రాసిన లేఖ పట్ల చాలామంది మగవాళ్ళు స్పందిస్తున్నారు. మగవాళ్ళు ఎదుర్కొనే మానసిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మనదేశంలో కారుణ్య మరణానికి సంబంధించి చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. సీరియస్ మెడికల్ కేసులలోనే కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి వ్యక్తిగత కలహాలు.. కుటుంబ సమస్యలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే కిరీటి పటేల్ లేక రాసినప్పటికీ అధికార యంత్రం గురించి ఇటువంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
