Homeజాతీయ వార్తలుKolkata Trainee Doctor Case : కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఎఫ్‌ఐఆర్‌...

Kolkata Trainee Doctor Case : కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యంపై ఆసహనం… వైద్యుల కోసం టాస్క్‌ఫోర్స్‌!

Kolkata Trainee Doctor Case : కోల్‌కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్, ఢిల్లీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఐఎంఏ ఇటీవల దేశవ్యాప్త బంద్‌కు పిలుపు నిచ్చింది. దీంతో 24 గంటలపాటు ఓపీ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది బెంగాల్‌ హైకోర్టు. విచారణ జరుగుతోంది. మరోవైపు ఆందోళనలూ కొనసాగుతున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార, హత్య ఘటనపై దేశం మొత్తం ఆగ్రహిస్తున్న విషయం తెలిసిందే. దారుణానికి ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాధితురాలి తండ్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం విధితమే. ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగానే మంగళవారం(ఆగస్టు 20న) విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు తీరును ధర్మాసనం తీవ్రంగా ఖండించింది. మెడికల్‌ కలేజీ ప్రిన్సిల్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

ప్రిన్సిపాల్‌ తీరుపై అసహనం..
కోల్‌కతా వైద్య విద్యార్థి ఘటన తర్వాత ప్రిన్సిపల్‌ ప్రవర్తనపై అనుమాలు ఉన్నా.. అతడిని వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

మీడియా సంస్థలపైనా ఆగ్రహం..
ఈ ఘటన విషయంలో పలు మీడియా సంస్థల తీరుపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫొటో, పేరును ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నించింది. అలాగే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలపైనా ధర్మాసం పలు కీలక ప్రశ్నలను సంధించింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యంగ్‌ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని కోర్టు వెల్లడించింది.

టాస్క్‌ఫోర్స్‌..
వైద్యుల భద్రత కోసం వెంటనే ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. రెండు వారాల్లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు డాక్టర్ల విధుల బహిష్కరణతో చాలా మంది రోగులు ఇబ్బందిపడుతున్నారని, తక్షణమే తమ నిరసనలు విరమించాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. అనంతరం ఈ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular