దేశంలోని అన్ని రాష్ట్రాలది ఒక దారి అయితే ఏపీది ‘ఉలికిపిట్ల’ దారి అన్నట్టు ఏపీలోని విద్యార్థుల భవిష్యత్ దృష్టానే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం బీరాలకు పోయింది. కానీ సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ‘పరీక్షలతో ఒక్క ప్రాణం పోయినా సరే రూ.కోటి పరిహారం ఇవ్వాలంటూ’ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా సెకండ్, థర్డ్ వేవ్ లంటూ ముంచుకొస్తున్న వేళ ఈ పరీక్షలు ఏంటని.. సీబీఎస్ఈ సహా జాతీయ పరీక్షలే రద్దు చేస్తే మీకెందుకు పంతాలు అంటూ ఈరోజు మండిపడింది.
దీంతో దెబ్బకు ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రద్దుకు గల కారణాలు వెల్లడించారు.
సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ అసాధ్యమని.. జులై 31 లోపు ఇంటర్ ఫలితాలు వెల్లడించడం సాధ్యం కాదని.. అందుకే పరీక్షలు రద్దు చేస్తున్నట్టు మంత్రి సురేష్ వివరణ ఇచ్చారు. మూల్యాంకనానికే 45 రోజులు పడుతుందన్నారు. మార్కులు ఏ పద్ధతిలో ఇవ్వాలో త్వరలో హైపవర్ కమిటీ వేసి నిర్ణయిస్తామన్నారు.
ఇక పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లోపం లేదని మంత్రి సురేష్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని.. సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. పరీక్షలతో ఒక్క విద్యార్థి చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. కరోనా వేళ ఒక్కో గదిలో 15 నుంచి 20మంది కూర్చోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. రెండోదశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం కదా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.