Demonetization: నవంబర్ 8, 2016… భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీ, పన్ను ఎగవేతలు, ఉగ్రవాద మూకలకు నిధులు చేరకుండా నియంత్రించడమే దీని లక్ష్యంగా ఆయన అభివర్ణించారు.. నాడు మోడీ తీసుకున్న నిర్ణయంతో రాత్రికి రాత్రే చలామణిలో ఉన్న పది లక్షల కోట్ల విలువైన కరెన్సీ తుడిచిపెట్టుకుపోయింది. అయితే నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవాళ సమర్థించింది.. అయితే ఇప్పుడు నాడు మోడీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు జనాల మెదళ్ళను తొలుస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఆనాడే ఈ నోట్ల రద్దుతో ఫలితం ఉండదని హెచ్చరించింది.. 2016 నవంబర్ 8 నాటికి 500, వెయ్యి నోట్ల కరెన్సీ ప్రకారం దేశంలో 15.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉంది. నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలు 2017 జూన్ వరకు 15.31 లక్షల కోట్ల నగదును బ్యాంకులో జమ చేశారు.. ఇవన్నీ కూడా 500, వెయ్యి నోట్ల రూపంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక లెక్కల ప్రకారం 99.9 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యమే ప్రశ్నార్ధకంగా మారింది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాని 1000, 500 నోట్ల విలువ 10,720 కోట్లు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది.

అనేక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు వల్ల అనేక సంస్థలు మూతపడ్డాయి.. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సమయానికి డబ్బు చేతికి రాక చాలామంది ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా బ్యాంకుల్లో ఘర్షణ వాతావరణం చెలరేగింది..క్యూలో నిలబడలేక వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రికి రాత్రే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన మోదీ.. అందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు నరకం చూశారు.. 2016లో తీసుకున్న ఈ నిర్ణయం 2020 వరకు కూడా దాని ప్రభావాన్ని చూపించింది.
డిజిటలైజేషన్ వైపు అడుగులు
కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత డిజిటలైజేషన్ వైపు అడుగులు పడ్డాయి. అప్పటికే వాడుకలో ఉన్న పే టీ ఎం కు పోటీగా ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే… వంటివి వెలుగులోకి వచ్చాయి. దీనివల్ల చెల్లింపుల్లో వేగం పెరిగినప్పటికీ… గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఇందుకు విభిన్నంగా ఉన్నది.. అయితే ఇప్పుడు పరిస్థితిలో కొంతమేర మార్పు వచ్చింది. చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయడంతో ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు చెల్లింపులు, లావాదేవీలు జరుపుతున్నారు.
ఆర్థిక అభివృద్ధి పై ప్రభావం
పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం పడిందని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది.. అనేక చిన్న చిన్న సంస్థలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.. వాస్తవానికి భారతదేశ ఆర్థిక రంగంలో అసంఘటిత రంగానిదే కీలకపాత్ర.. సుమారు 40 కోట్ల మంది వీటి ఆధారంగా ఉపాధి పొందుతున్నారని అసోచామ్ లెక్కలు చెబుతున్నాయి. పూర్తిగా నగదు ఆధారంగా నడిచే వీటి కార్యకలాపాలు మొత్తం పూర్తిగా మూతపడటంతో కార్మికులకు ఉపాధి కరువైంది.. దీంతో అది దేశ ఆర్థిక ప్రగతి పై ప్రభావం చూపించింది..

వాదనలు ఎలా జరిగాయంటే
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనుట రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. కేంద్రం ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని పిటిషన్ దారులు అభ్యర్థించారు. ప్రత్యక్షంగా ఎలాంటి ఉపశమనం ఇవ్వని అంశంలో సుప్రీంకోర్టు నిర్ణయం సబబు కాబోదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇలా చేయడం అంటే గడియారాన్ని వెనక్కి తిప్పటం, పగిలిన గుడ్డును అతికించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది.. శీతాకాలం విరామానికి ముందు డిసెంబర్ 7న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ వాదనలు విన్నది. ఈ బెంచ్ కు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వం వహించారు. అయితే ఆ తీర్పును సోమవారం ప్రకటించారు.. అయితే పెద్ద నోట్ల రద్దును తగిన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సమర్ధించుకుంది. అయితే నకిలీ కరెన్సీ లేదా బ్లాక్ మనీని అరికట్టేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు తీసుకున్నారో చెప్పలేదని సీనియర్ అడ్వకేట్ పి..చిదంబరం వాదించారు. పెద్ద నోట్ల రద్దు పై చట్టబద్ధ ప్రక్రియను ప్రారంభించలేదని చిదంబరం ప్రస్తావించారు.. ఒక ఆర్బిఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సును మాత్రమే పరిగణలోకి తీసుకున్నారని తప్పు పట్టారు. అయితే ఈ విషయంలో జనాలు తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది.. దేశ నిర్మాణంలో ఇలాంటి పరిస్థితులు సహజమేనని సమర్థించుకుంది. తర్వాత అనేక సమస్యలను పరిష్కరించినట్లు సుప్రీంకోర్టుకు వివరించింది. అయితే 2016 నాటికంటే 72% కరెన్సీ ఎక్కువగా చలామణిలో ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆరోపించారు.. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ఇప్పటికైనా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.