దేశంలోనే పూరి జగన్నాథుడి రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఒడిశాలోని లక్షలాది భక్తుల సమక్షంలో పూరి రథయాత్ర ఘనంగా జరుగుతోంది. ప్రతీయేటా 10నుంచి 12రోజులపాటు జరిగే పూరి జగన్నాథుడు రథయాత్రకు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా జగన్నాథుడి రథయాత్ర ఘనంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. జూన్ 23నుంచి నిర్వహించనున్న ఈ రథయాత్రకు కరోనా కారణంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈమేరకు గురువారం పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రభుత్వం నిర్వహించొద్దని ఆదేశాలను జారీ చేసింది.
కేంద్రం లాక్డౌన్లో పలు సడలింపులను ఇచ్చింది. జూన్ 8నుంచి దేవాలయాలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ దేవాలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే సామూహిక ఉత్సవాలపై నిషేధాలు కొనసాగుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం జగన్నాథుడి రథయాత్రను ఈనెల 23నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతియేటా ఈ ఉత్సవాల్లో 10నుంచి 12లక్షల మంది భక్తులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈసారి కరోనా కారణంగా 10వేల మందితో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
ఈనేపథ్యంలోనే ఓ స్వచ్ఛంధ సంస్థ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది. కరోనా కారణంగా రథయాత్రను నిలిపివేయాలని ఆ సంస్థ పిటిషన్లో కోరింది. దీనిపై సుప్రీం ధర్మాసం గురువారం విచారణ చేపట్టి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ‘జగన్నాథ్’ అంటే ఆపలేనిది అని అర్థంమని.. కానీ ఎన్నడూ ఆగని జగన్నాథుడి రథచక్రాలను కరోనా మహమ్మారి వల్ల ఆపాల్సి వస్తోందని.. కరోనా సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. రథయాత్రతో సంబంధించి ఎటువంటి వేడుకలు నిర్వహించొద్దని.. భక్తులను అనుమతించవద్దని పేర్కొంది.
ఇప్పటికే తెలంగాణలోనూ ప్రతియేటా భాగ్యనగరంలో ఘనంగా నిర్వహించే బోనాల వేడుకలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బోనాలను ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. అమ్మవారికి పూజారుల బృందం బోనాల సమర్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా కారణంగా బోనాల వేడుకల కళతప్పడంతో భాగ్యనగరం కళతప్పనుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ తదితర పండుగలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తాజాగా జగన్నాథుడి రథయాత్ర సైతం కరోనా కారణంగా నిలిచిపోవడం శోచనీయంగా మారింది.