Chandrababu Case: పౌరుల హక్కులను కాపాడడంలో న్యాయవ్యవస్థ కీలకమైనది. ఎక్కడైనా హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పౌరుల హక్కులతో పాటు రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానాలదే ముఖ్య పాత్ర. అందుకే విశాల దృక్పథంతో, లోతైన విశ్లేషణతో న్యాయమూర్తులు తీర్పులు చెబుతుంటారు. సంక్లిష్టమైన కేసుల్లో సైతం సున్నితమైన అంశాలను, పౌరుల ప్రయోజనాలను పెద్దపీట వేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు పైనే సర్వత్రా చర్చ నడుస్తోంది.
అక్టోబర్ 3న అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణకు రానుందని తొలుతా భావించినా.. అక్టోబర్ 6 వరకు వచ్చే ఛాన్స్ లేదని కోర్టువర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో త్రిసభ్య, ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు కేసు విచారణ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు చరిత్రలో మిగలనుంది. చంద్రబాబు తరఫున న్యాయవాదులు లేవనెత్తుతున్న అంశాలే ఇందుకు కారణం. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ అంశం ఎంతో కీలకమైనది. సుప్రీంకోర్టు ఆదేశాలు అవినీతి నిరోధక చట్టం ప్రకారం దేశానికి దిక్సూచి కానున్నాయి. తీర్పు ఎలా వచ్చినా సంచలనమే.
నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్టు చేశారని.. అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చారని.. రిమాండ్ రిపోర్టులో సైతం తప్పులు, తడకలు ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. ముఖ్యంగా సెక్షన్ 17 ఏ విషయంలో దర్యాప్తు సంస్థ, ప్రాసిక్యూషన్ హద్దులు మీరాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో దిగువ రెండు కోర్టులు చంద్రబాబును రిమాండ్ విధించడం, అటు ఆపీళ్లకు హైకోర్టుకు వెళితే.. న్యాయమూర్తి పేర్కొన్న కొన్ని అంశాలు చట్టబద్ధంగా సహితుకంగా లేకపోవడం, సెక్షన్ 17 ఏ విషయంలో న్యాయమూర్తి తనదైన నిర్వచనంతో పేర్కొనడం, అరెస్టును సమర్థించడం లాంటి జఠిలమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.
సుప్రీంకోర్టులో వెలువడే తీర్పు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలవనుంది. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు తప్పు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు లోతైన విశ్లేషణ చేసి తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో కనుక తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం,చట్టాలు, పౌర హక్కులు, మానవ హక్కులు బతికి బట్ట కట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం దశాబ్దాల కాలం కిందటనాటి నుంచి అధికారం చేపట్టి మాజీలుగా మారిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఈ తీర్పుకు లోబడి పాలక పక్షం వేధింపులకు, కేసులకు బాధిత వర్గాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే న్యాయవ్యవస్థ పాత్ర పైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. దేశ పౌరులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరిధిని పెంచుకొని పౌర హక్కులను, రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరుతున్నారు. న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని నియంత్రించాలని వేడుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సహేతుకమైన సాక్షాధారాలు ఉన్నా కూడా.. కొందరి నిందితులను దర్యాప్తుకు పిలవడం లేదన్న అపవాదు ఉంది. అదే సమయంలో ఏమాత్రం హేతుబద్ధమైన సాక్షాధారాలు లేకుండా, వ్యవస్థలను మేనేజ్ చేసి.. ఓ రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా పాలించిన ఓ నాయకుడును నెలరోజులపాటు రిమాండ్ ను కొనసాగించడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం కలుగ చేసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికైతే చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది.