Supreme Court- Gali Janardhana Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసు గుర్తుంది కదూ… పుష్కరకాలం కిందట నాటి యూపీఏ ప్రభుత్వం హయాంలో సీబీఐ నమోదుచేసిన కేసు ఇది. కర్నాటకకు చెందిన బీజేపీ నాయకుడు గాలి జనార్దనరెడ్డిపై అక్రమ మైనింగ్ జరుపుతున్నారంటూ అభియోగాలు మోపిన సీబీఐను ఆయన్ను అరెస్ట్ చేసింది. కేసులు నమెదుచేసింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కానీ 12 ఏళ్లు దాటుతున్నా ఆ కేసులకు సంబంధించి విచారణ ప్రారంభం కాలేదు. కనీసం ట్రయల్ రన్ కూడా వేయలేదు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం విచారణను ప్రారంభించాలని ఆదేశించింది. ఒక సీరియస్ కేసు లో ఇలా తాత్సారం చేయడం తగునా అని సీబీఐ అధికారులపై సుప్రీం కోర్టు ధర్మాసం అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 19లోగా అన్నివివరాలను సమగ్రంగా కోర్టుకు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
గాలి జనార్థనరెడ్డి కర్నాటకలో బలమైన బీజేపీ నేత. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నా.. కర్నాటకలోని బళ్లారి చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రం జనార్దనరెడ్డి హవా నడిచేది. దక్షణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ సంకల్పం గాలి జనార్దనరెడ్డితో సాధ్యమయ్యిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. 2010లో ఓబుళాపురంలో అక్రమంగా మైనింగ్ చేశారంటూ సీబీఐ అభియోగాలు మోపింది. కేసులు నమోదుచేసింది. జనార్దనరెడ్డిని జైలుకు కూడా పంపించింది. అయితే నాటి యూపీఏ ప్రభుత్వ కక్ష కట్టి జనార్దనరెడ్డిపై కేసులు మోపిందని నాటి విపక్షం బీజేపీ ఆరోపించింది. అటు తరువాత కేంద్రంలో 2014లో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి గాలి జనార్దనరెడ్డి కేసు నీరుగార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరకాలం దాటిన కేసు విచారణకు రాకపోవడం వెనుక రాజకీయ శక్తులు పనిచేశాయన్న కామెంట్స్ అయితే ఉన్నాయి.
ఇటీవల తరచూ ప్రధాని మోదీ అవినీతిని సహించేది లేదని చెబుతున్నారు. అవినీతిని అంతం చేస్తేనే దేశం బాగుంటుందని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే సమయంలో విపక్షాలపై సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కానీ బీజేపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన గాలి జనర్దానరెడ్డి అవినీతి కేసు గుర్తుకురాలేదా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక కేసు విచారణకు ఇన్నేళ్లు అవసరమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజాగా తన బెయిల్ షరతుల నిబంధనలు మార్చాలని గాలి జనార్దనరెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. బుధవారం నాడు కోర్టులో విచారణకు రాగా… న్యాయమూర్తులు కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.12 సంవత్సరాలవుతున్నా ట్రయల్ రన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దేశంలో సీరియస్ కేసుల్లో ఒకటైనా.. ఎందుకు నిర్లక్ష్యం చేశారని సీబీఐ న్యాయవాదని ప్రశ్నించారు. కేసులో మొత్తం 9 మంది నిందితులున్నారని.. వారు కింది కోర్టుల్లో పిటీషన్లు వేశారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ దీనిపై న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కింది కోర్టులు ఏమైనా స్టేలు ఇచ్చాయా అని ప్రశ్నిస్తే తమకు తెలియదంటూ వారు బదులిచ్చారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు సమగ్ర వివరాలను ఈ నెల 19లోగా తమ ముందు ఉంచాలని ఆదేశించారు. మరోవైపు బెయిల్ షరతుల నిబంధనలు మార్చాలని కోరుతూ పిటీషనర్ తరుపున న్యాయవాది తమ వాదనలను వినిపించారు, గాలి జనార్థన రెడ్డి బళ్లారి వెళ్ల ఎవర్నీ బెదిరించలేదని కూడా గుర్తుచేశారు. అయితే ఇరువర్గాలవాదనను విన్న న్యాయమూర్తులు కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు.