Sujay Krishna Rangarao: ఏపీ పాలిటిక్స్ లో బొబ్బిలి రాజా కుటుంబానిది ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి బొబ్బిలి రాజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అటువంటి కుటుంబం నుంచి రాజకీయ ఆరంగెట్రం చేసిన సుజయ్ కృష్ణ రంగారావు మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ ఇటీవల పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. బయట పెద్దగా కనిపించడం మానేశారు. దీంతో ఆయన వేరే ఆలోచనతో ఉన్నారా? లేకుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో బలమైన రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబాల్లో వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా కాంగ్రెస్ లో చేరిన వారే బొబ్బిలి రాజులు. 2004 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సైతం రెండోసారి విజయం సాధించారు. కానీ మంత్రి కాలేకపోయారు. వైసీపీలో చేరి ఆ ముచ్చట తీర్చుకోవాలని భావించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో 2017లో టిడిపిలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. టిడిపిలో పదవి ఉన్నా పెద్దగా పనిచేయడం లేదు.
వచ్చే ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయనా బొబ్బిలి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని హై కమాండ్ ప్రకటించింది. బేబీ నాయన సైతం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యే అభ్యర్థిగా, బేబీ నాయనా విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ ఇందులో ఒక్క సుజయ్ కృష్ణ రంగారావు మాత్రమే విజయం సాధించారు. ఇప్పుడు కూడా బేబీ నాయన ఎమ్మెల్యేగా, సుజయ్ కృష్ణ రంగారావు విజయనగరం ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో తూర్పు కాపులు అధికం. చంద్రబాబు సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఈ లెక్కన సుజయ్ కృష్ణ రంగారావుకు విజయనగరం లోక్సభ సీటు దక్కే అవకాశాలు లేవు. ఒక్క బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి రాజులను పరిమితం చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో సుజయ్ కృష్ణ రంగారావు సేవలను రాజ్యసభ, ఇతర నామినేటెడ్ పదవుల ద్వారా వినియోగించుకుంటారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.