Gudivada TDP: వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవాలని భావిస్తున్న కీలక నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. టిడిపి ద్వారా రాజకీయ ఆరంగెట్రం చేసి.. ఆ పార్టీ నాయకత్వాన్ని హేళన చేసేలా నాని తరచూ మాట్లాడుతుంటారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆయన్ను మట్టి కరిపించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గెలిచినా.. గుడివాడలో మాత్రం నెగ్గకుంటే పార్టీ శ్రేణులకు నిరాశే.
అయితే ఈసారి చంద్రబాబు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని కి ఓటమి రుచి ఏంటో చూపించాలని తండ్రీ కొడుకులు గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకే ఒకవైపు క్యాడర్ కు దిశా, నిర్దేశం చేస్తూ.. మరోవైపు బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎన్నారై వెనిగళ్ళ రామును కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అర్థ బలం, అంగ బలం ఉన్న ఆయన అయితేనే కొడాలి నాని కి బలమైన ప్రత్యర్థి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒకవేళ కానీ రావి వెంకటేశ్వరరావు వెనిగళ్ళ రాముకు సహకారం అందిస్తే నానిని ఓడించవచ్చని టిడిపి క్యాడర్ భావిస్తోంది. అయితే ఇందుకు రావి వెంకటేశ్వరరావు ఒప్పుకుంటారా?లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. రావి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకుడు. 2000లో గుడివాడ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కొడాలి నాని కి టిడిపి టికెట్ లభించింది. 2009లో సైతం కొడాలి నాని వైపే టిడిపి నాయకత్వం మొగ్గు చూపడంతో.. రావి వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. 28 వేల ఓట్ల వరకు దక్కించుకున్నారు. 2014లో కొడాలి నాని వైసీపీలో చేరడంతో టిడిపి టికెట్ రావికి దక్కింది. అయినా సరే ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనకు సైతం రావి వెంకటేశ్వరరావు సంపూర్ణ సహకారం అందించారు. గత నాలుగేళ్లుగా టిడిపి బలోపేతానికి రావి వెంకటేశ్వర కృషి చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ లభిస్తుందని రావి వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు. కానీ కొడాలి నాని కి చెక్ చెప్పాలంటే బలమైన అభ్యర్థి కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. వెనిగళ్ళ రాముకు రావి వెంకటేశ్వరరావు సపోర్టు లభిస్తే కొడాలి నాని కి చెక్ చెప్పవచ్చని టిడిపి ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ముంగిట కాకుండా.. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేస్తే.. వర్కౌట్ అవుతుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఏది ఏమైనా టిడిపి నాయకత్వం గుడివాడ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. చాలా రకాలుగా వ్యూహాలు పన్నుతోంది.