Stubborn To Sachivalayam Employees: ‘ఉద్యోగం వచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగస్థులమన్న భావన రావడం లేదు. అసలు ప్రొబిషన్ డిక్లరేషన్ అయ్యిందో లేదో తెలియడం లేదు’.. ఏపీలో ఏ ఇద్దరు సచివాలయ ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వారు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ పాలనను సులభతరం చేసేందుకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 19 రకాల సహాయకులను ఉద్యోగులుగా నియమించారు. 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు వీరికి నియామక పత్రాలు అందించారు. సరిగ్గా రెండేళ్ల తరువాత అంటే..2021 అక్టోబరు 2న ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం పెట్టిన గడువు రానే వచ్చింది. కానీ ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. అదేమిటంటే సామర్థ్య పరీక్షలను తెరపైకి తెచ్చారు. పరీక్షలు నిర్వహించగా.. కొంతమంది ఉత్తీర్ణత సాధించారు. వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయాల్సి ఉన్నా..అందరికీ ఒకేసారి చేస్తామని గడువును మరో ఎనిమది నెలల పాటు పొడిగించారు. ఈ లెక్కన జూన్ లో డిక్లరేషన్ పూర్తిచేసి.. జూలై 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు కేటాయిస్తారని బావించారు. కానీ జూన్ రెండో వారం గడుస్తున్నా దీనిపై క్లారిటీ లేదు. అసలు ప్రభుత్వం ద్రుష్టిలో ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్న అంశం ఉందా లేదా అన్నది తెలియడం లేదు.

స్పష్టత కరువు
ఇంత వరకూ ఎంత మందిని ప్రొబేషన్‌కు ఎంపిక చేశారు ? అన్నదానిపై క్లారిటీ లేదు. ఉత్తర్వులు రాలేదు. ఓ సారి ప్రభుత్వం నేరుగా జీవో ఇస్తుందని చెబుతారు.. మరోసారి కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేస్తారని చెబుతారు. కానీ ఇప్పటి వరకూ ఏ ప్రక్రియ ద్వారా ప్రొబేషన్ ఖరారు చేస్తారో మాత్రం స్పష్టత రాలేదు. దాదాపుగా లక్షా ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగలు ఈ ప్రొబేషన్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు.లెక్క ప్రకారం ఎలాంటి పరీక్షలు లేకుండా అందర్నీ ప్రమోట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఖరారు చేసి ఆ మేరకు పే స్కేల్ ఇవ్వాలి. ఇందు కోసమే వారు దాదాపుగా మూడేళ్లుగా రూ. పదిహేను వేలకే పని చేస్తున్నారు. ఇంత తక్కువ జీతానికి ఏళ్ల తరబడి పనిచేయడంతోచాలా మంది ఆవేదనకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏరికోరి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ వారిని పట్టించుకోవడం లేదు. పరీక్షలని.. మరొకటని వారిని వేధింపులకు గురి చేస్తోంది. తాజాగా గడువు మించిపోతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఉద్యోగుల్లో టెన్షన్..

జూలై మొదటికి పెరిగిన జీతాలు వస్తాయని ఆశపడుతున్న వారికి రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు ప్రొబేషన్లు ఖరారు చేసిన వారికి జీతం బిల్లులు ప్రిపేర్ చేయాలంటే చాలా లెక్కలు చూడాల్సి ఉంటుంది. చాలా ప్రక్రియ ఉంటుంది. సమయం సరిపోదని.. వాయిదా వేస్తారేమోనన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోతే సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల్ని టెన్షన్ పెట్టకుండా వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
[…] […]
[…] […]