Homeఆంధ్రప్రదేశ్‌టీడీపీకి వలసలతో ఎదురుగాలి..

టీడీపీకి వలసలతో ఎదురుగాలి..

రాష్ట్రంలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసిపి అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని విడిచి వెళ్లిపోవడంతో అధినేత చంద్రబాబు నాయుడులో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాబు ఒక నాయకుడు వెళితే వంద మంది నాయకులు తయారు చేస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే కొందరు టిడిపి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో జంపు జిలానీల సంఖ్య మరింత పెరిగింది. వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలపై పెడుతున్న కేసులు, ఇతర వేధింపుల కారణంగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరికొందరు నాయకులు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసిన టిడిపిలోని ఇతర నాయకులు ఇబ్బందులను తెచ్చుకోవడం ఎందుకని వైసీపీ నేతలతో ముందే మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరుతున్నారు.

ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణి, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టిడిపి కన్వీనర్ సతీష్ రెడ్డి తదితరులు గత కొద్ది రోజుల్లో టిడిపిని విడిచి వైసిపి తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ని బలహీనపరచడం మే లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి ఈ వలసలను  ప్రోత్సహిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన దేవినేని అవినాష్ పార్టీలో చేర్చుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడం ఇందుకు నిదర్శనం. అదేవిధంగా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకో వద్దని నియోజకవర్గ కన్వీనర్ వెంకట్రావు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసిన అధినేత పట్టించుకోలేదు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో  ఉన్నారని ప్రకటించగా, మంత్రులు సైతం 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బహిరంగంగా ప్రకటించారు. ఈ వలసలు అడ్డంపెట్టుకుని టీడీపీని బలహీన పరచాలని వైసిపి ప్రయత్నిస్తుండగా, టిడిపి ఆత్మరక్షణలో పడింది.

● అంతర్గత విభేదాలు ఒక కారణమే:

టీడీపీలో ఉన్న ఆ పార్టీ నాయకులు వైసీపీలో చేరటానికి అధికార పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ ఒక అంశం కాగా, టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వైఖరి, చుట్టూ ఉన్న కోటరి కారణంగా ఉన్నాయి. గత ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి టిడిపిలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను పక్కన పెట్టడం, ఎన్నో ఏళ్లుగా టిడిపి కోసం పని చేసిన తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, వారి సూచనలు, సలహాలు పట్టించుకోక పోవడంతో వీరంతా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేసినా టిడిపి పార్టీ జోక్యం చేసుకోకపోవడం తో పాటు, అధినేత, ఇతర నాయకులు ఎటువంటి మద్దతు ఇవ్వకపోవడంతో కోడెల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వాదనలు వినిపించాయి. ఈ వైఖరిని పార్టీ నేతలు కొందరు తప్పుబడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో టిడిపి ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుకోలేకపోవడానికి, ఎన్నికల్లో గోర పరాజయానికి చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ ఉన్న కోటరీ ని కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విసుగు చెందిన టిడిపి సీనియర్ నాయకులు వారిని, వారి ఆస్తులను రక్షించుకోవడం కోసం అధికార పార్టీ కి జై కొడుతూ ఆ పార్టీలో చేరుతున్నారు. ఈ వలసల కారణంగా టిడిపి తన ప్రభావాన్ని కోల్పోతుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular