Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు విషయాల్లో కఠినంగా వ్యవహరించిన ఈసి పోలింగ్ విషయంలో సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా పోలింగ్ రోజున రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం.
2018 ఎన్నికల్లో కొన్ని ప్రైవేటు సంస్థలు సెలవులు ప్రకటించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో ఫిర్యాదులు సైతం వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సెలవు ఇవ్వని ఎడల సదరు సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి ఆదేశించారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బోధ గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే షెడ్యూల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమై ఉంది. మరోవైపు నేటి సాయంత్రం ఐదు గంటలకు ప్రచార పర్వము ముగిసింది. మరో 36 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మధ్యాహ్నం నాటికే విజేతలు ఎవరు అన్నది తేలిపోతుంది.